పూర్ణాహుతి కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు
తిరుమల: తిరుమల అంజనాద్రిలో ఆకాశగంగ వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుందరీకరణ పనులకు భూమిపూజను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు, విశ్వహిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ పాల్గొన్నారు.
టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు, కంకణబట్టార్ మోహన రంగాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు రక్షబంధన పూజ, అంకురార్పణ, పంచగవ్యారాధన, వాస్తుహోమం, శిలలకు వాస్తు దర్శనం, శంఖునకు అభిషేకం, విశేష హోమాలు, రత్నన్యాసం, ప్రథమ శిలాస్థాపన, భూమిపూజ నిర్వహించారు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులు(దాతలు) నాగేశ్వరరావు, మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఫల, పుష్పాలంకరణ..
ఆకాశగంగ వద్ద భూమి పూజ ప్రాంగణంలోని వేదికపై ఏర్పాటు చేసిన ఫల, పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్, మొక్కజొన్న, రోజా, సంపంగి, కట్ ఫ్లవర్స్‌తో అద్భుతంగా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment