
తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 1,072 ఆలయాల నిర్మాణానికి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ (డీపీపీ) కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలిపింది. త్వరలో భారీ ఎత్తున కల్యాణమస్తు, సామూహిక వివాహాలు, దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని తీర్మానించింది. తిరుపతిలో గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ధర్మకర్తల మండలి సభ్యురాలు అల్లూరి మల్లీశ్వరి వర్చువల్‌గా, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈవో సత్యనారాయణ పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.
► రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయం రూ.10 లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం. ఈ ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి దేవదాయశాఖ సహకారంతో తిరుపతిలో శిక్షణ.
► దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రతినెలా శ్రీనివాసకల్యాణం.
► ఏప్రిల్ 23న కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్, మే 8న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మే నెలలో ఢిల్లీ, జూన్‌లో హైదారాబాద్, జూన్ 23 నుంచి జూలై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాసకల్యాణాల నిర్వహణ.
► గోదావరి జిల్లాల్లో త్వరలో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు.
► కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడడంతో సామూహిక వివాహాల నిర్వహణకు పండిత మండలి ఏర్పాటు. మండలి నిర్ణయించే పవిత్ర ముహూర్తాల్లో జిల్లా యంత్రాంగాల సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహణ.
► తిరుపతిలో ప్రతినెలా టీటీడీ ఆధ్వర్యంలో ఒక యజ్ఞం. మే నెలలో అన్నమయ్య జయంతి ఉత్సవాల నిర్వహణ.
► గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ఇప్పటికి దేశంలోని 141 ఆలయాలకు ఉచితంగా గోవు, దూడ అందజేత. ఈ కార్యక్రమాన్ని విస్తృత పరిచే ఏర్పాట్లు.
► రాష్ట్రంలోని టీటీడీ, దేవదాయశాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించి, వారు పండించిన ఉత్పత్తులను శ్రీవారి ప్రసాదాల తయారీకి కొనుగోలు చేయాలి.