అధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి
తిరుమల: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో చాంబర్‌లో శ్రీవాణి ట్రస్టుపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రస్టు ద్వారా చేపట్టిన 50 నూతన ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణ పనులు, 42 భజన మందిరాల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు.
శ్రీవాణి ట్రస్టు, దేవదాయ శాఖ సీజీఎఫ్ ద్వారా మంజూరు చేసే ఆలయాల నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ డేటాబేస్డ్ సిస్టమ్‌ను తయారు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి అందిన 1,100 దరఖాస్తులను దేవదాయ శాఖ పరిశీలనకు పంపామని, పరిశీలన పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడంలో భాగంగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ఆలయాలు లేనిచోట ఆలయ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యుటీ సీఈ ప్రసాద్, డిప్యుటీ ఈవో జనరల్ డాక్టర్ రమణప్రసాద్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి లంక విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment