సాక్షి, అమరావతి: ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులకు దేవదాయ శాఖ స్వస్తి పలకనుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించరు. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ సంచుల వినియోగానికి పూర్తిగా చెక్ పెడతారు. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు.
ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి. జూలై 1 నుంచి ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలిచ్చింది.
టీటీడీ తరహాలో మంచినీటి సరఫరా..
తిరుమలలో గత కొద్ది నెలల నుంచి ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమలు జరుగుతున్న తరహాలోనే ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచినీటి సరఫరాకు చర్యలు చేపడతారు. అలాగే మంచినీటి సరఫరా పాయింట్ల వద్ద స్టీల్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఇంటి నుంచి మంచినీరు తెచ్చుకున్నా గాజు సీసాలు లేదంటే స్టీల్ బాటిళ్లలో తెచ్చుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
పర్యావరణానికి, జీవజాలానికి హాని..
ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆలయాల వద్ద సంచరించే గోవులతోపాటు ఇతర జంతువులు కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ఆలయాల వద్ద ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి స్వస్తి పలకాలని దేవదాయ శాఖ నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవదాయ శాఖ కార్యక్రమాలపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీలో అమలులో ఉన్న మంచి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు.
ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం
Published Sun, May 8 2022 4:22 AM | Last Updated on Sun, May 8 2022 4:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment