సర్వభూపాల వాహనంలో కాళీయమర్ధనుడిగా ఉన్న మలయప్పకు సాత్తుమొర ఆలపిస్తున్న వేదపండితులు
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కాళీయమర్ధనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీరాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహన సేవలలో పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములు, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి దంపతులు, ఇతర అధికారులు, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీనివాసుడికి గోదాదేవి మాలలు.. చెన్నై నుంచి గొడుగులు
తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి మాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. తొలుత పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజల అనంతరం వీటిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవిల్లి పుత్తూరు ఆలయంలో గోదాదేవికి అలంకరించిన మాలలను సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడవాహన సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే, నేటి గరుడవాహన సేవలో స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టుఆధ్వర్యంలో చెన్నై నుండి 9 గొడుగులను ఆదివారం తిరుమలకు తీసుకొచ్చారు. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జీ వీటిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకుఅందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment