
సాక్షి, తిరుమల : లోక సంక్షేమం కోసం కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపట్టిన షోడశదిన సుందరకాండ దీక్ష నేటితో ముగిసింది. తిరుమలలోని వసంత మండపంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది. "రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః " అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహించి,నేడు పూర్ణాహుతి నిర్వహించారు. నూతనంగా భాద్యతలు చేపట్టిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్షలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహా సంకల్పంతో దీక్ష చేపట్టిన అదనపు ఈవో ధర్మారెడ్డిని అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు విరాళాలు అందించిన దాతలకు జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేవదేవుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి పూర్తిగా అంతం అవుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. (ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు)