సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ పేషెంటు రావడం, ఆస్పత్రిలో చేర్చుకోవడం, వసతులు లేకపోతే మరో ఆస్పత్రికి వెళ్లండని చెప్పడం జరిగేవి. కానీ, ఇప్పుడిక అలా కుదరదు. కొత్త విధానం ప్రకారం.. వివిధ స్థాయిల్లోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ బాధ్యతతో కూడిన చికిత్సలు, చేరికలు ఉండాలని.. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అన్ని ఆస్పత్రులూ అనుసంధానమై ఉండాలని అధికారులు నిర్ణయించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధనాసుపత్రి ఇలా అన్ని స్థాయిల్లోని ఆస్పత్రులు సమాచార లోపం లేకుండా పనిచేయాలి. త్వరలోనే ఈ సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు.
సంస్కరణల్లో ప్రధానాంశాలు..
– ఒక ఆస్పత్రి నుంచి నుంచి మరో ఆస్పత్రికి రోగిని అనవసరంగా పంపించకూడదు. మౌఖిక ఆదేశాలు కుదరవు. విధిగా కారణాలు రాయాలి. పీహెచ్‌సీలో ఎక్స్‌రే ఉన్నప్పుడు అదే ఎక్స్‌రేకు మరో ఆస్పత్రికి పంపించకూడదు.
– స్పెషలిస్టు డాక్టరు వద్దకు లేదా పెద్దాసుపత్రులకు పంపించేటప్పుడు ఫోన్ ద్వారా వారికి వివరాలన్నీ చెప్పి పేషెంటును పంపించాలి.
– రోగి ఉన్నతాసుపత్రికి వెళ్లిన వెంటనే చేర్చుకుని వైద్యం అందించాలి. అక్కడికెళ్లాక రోగులు కారిడార్‌లలో వేచి ఉండే పరిస్థితి ఉండకూడదు.
– గోల్డెన్ అవర్‌లో రోగి ప్రాణాలు కాపాడేందుకు యత్నించాలి.
పీహెచ్‌సీ స్థాయిలో ఇలా..
– రోగిని చేర్చుకునే సమయంలో అన్ని రకాల వివరాలు నమోదు చేయాలి. రోగికి సంబంధించి మెడికల్ ఆఫీసర్/నర్సుదే ప్రాథమిక బాధ్యత.
– ప్రాథమిక దశలో అన్నిరకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. తక్షణమే ప్రాథమిక వైద్యం అందించాలి.
– రోగికి పీహెచ్‌సీ స్థాయిలో వైద్యంలేదని నిర్ధారించుకున్నాకే సీహెచ్‌సీ లేదా ఏరియా ఆస్పత్రికి 104లో పంపించాలి.
సీహెచ్‌సీ/ఏరియా/జిల్లా ఆస్పత్రి/బోధనాసుపత్రుల్లో ఇలా..
– కిందిస్థాయి ఆస్పత్రుల నుంచి వచ్చిన పేషెంట్లను 10 నిమిషాల్లో చేర్చుకోవాలి.
– రోగి పరిస్థితిని బట్టి ప్రొటోకాల్ ట్రీట్‌మెంటు పాటించాలి.
– పెద్దాసుపత్రికి పంపించేటప్పుడు రోగి పరిస్థితిని స్పెషలిస్టు డాక్టరుకు పూర్తిగా వివరించాలి.
– పైస్థాయి ఆస్పత్రుల వైద్యం అవసరమైనప్పుడు కిందిస్థాయి ఆస్పత్రుల్లో 10 నిమిషాల్లో డిశ్చార్జి ప్రక్రియ పూర్తిచేయాలి.
– బోధనాసుపత్రుల్లోనూ వైద్యం లేకపోతే అప్పుడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్‌వర్క్ ఆస్పత్రులకు పంపించాలి.
రెఫరల్ విధానం పారదర్శకంగా ఉండాలి
– రోగులను ఇతర ఆస్పత్రులకు పంపించేటప్పుడు కనీస కారణాలు చూపించాలి.
– దీనికి పీహెచ్‌సీ లెవెల్లో మెడికల్ ఆఫీసర్.. ఇతర ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్లు బాధ్యత వహించాలి.
– మనం ఏ ఆస్పత్రికి అయితే రెఫర్ చేస్తున్నామో అక్కడ వైద్యానికి వసతులు ఉన్నాయో లేదో తెలుసుకున్నాకే పంపించాలి.
Comments
Please login to add a commentAdd a comment