సాక్షి, అమరావతి: ప్రజలకు ఆరోగ్య రికార్డుల మోత బరువు తగ్గించే దిశగా రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు పేపర్ రహిత సేవల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కార్యక్రమంలో భాగంగా దేశంలో ఎక్కడికి వెళ్లినా పేపర్ రహిత వైద్య సేవలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ నంబర్ ఇస్తున్నారు.
ఓపీ, ఐపీ స్లిప్పులు, వైద్య పరీక్షల ఫలితాలు, చికిత్సకు సంబంధించిన ఫైళ్లు వంటివి కంప్యూటరీకరించి పేపర్ రహిత సేవలు అందించడానికి వీలుగా ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యకలాపాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,90,25,469 మందికి డిజిటల్ ఐడీలు సృష్టించారు. అదే విధంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాసుపత్రి వరకూ 14,368 ఆసుపత్రులు రిజిస్టర్ చేశారు. 7,345 మంది ప్రభుత్వ వైద్యులు రిజిస్టర్ అయ్యారు. పౌరులు, ఆసుపత్రులు, వైద్యులు మూడు విభాగాల రిజిస్ట్రేషన్‌లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం.
5.44 లక్షల ఓపీలు నమోదు
ఏబీడీఎం ఈ–హాస్పిటల్ కార్యక్రమంలో భాగంగా గత ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పేపర్ రహిత సేవలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 1,03,740 ఓపీలు నమోదయ్యాయి. అదే విధంగా 100కు పైగా పడకలున్న ఏరియా, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి 54 చోట్లలో గత మార్చి నుంచి ఈ–హాస్పిటల్ సేవలు మొదలుపెట్టారు. కొన్ని ఆసుపత్రులోŠల్ అన్ని విభాగాల్లోనూ, మరికొన్ని చోట్ల పరిమిత విభాగాల్లో ఈ–హాస్పిటల్ సేవలు రోగులకు అందుతున్నాయి. ఇప్పటి వరకూ 4.41 లక్షల ఓపీలు నమోదయ్యాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి మొత్తంగా 5.44 లక్షల ఓపీలు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ–హాస్పిటల్స్‌గా మార్చడానికి ఇప్పటికే వైద్యులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాల వారీగా నోడల్ అధికారులను సైతం నియమించారు.
పైలట్ ప్రాజెక్టుకు రాష్ట్రం ఎంపిక
ఏబీడీఎం కార్యక్రమాల్లో రాష్ట్రం చురుగ్గా ముందుకు వెళ్తున్న క్రమంలో నర్సింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి పైలట్‌గా ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. దీంతో దేశంలోనే మొదటగా రాష్ట్రంలో ఏబీడీఎంలో నర్సుల రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభంకానుంది.
పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్‌కు సిఫార్సు
ఏబీడీఎం కార్యకలాపాల్లో వేగంగా ముందుకు వెళ్తున్నాం. నర్సుల రిజిస్ట్రేషన్ మన దగ్గరే తొలుత ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. రోగుల వైద్య పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో పారామెడికల్ సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నర్సులతో పాటు పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేపడతామని సిఫార్సు చేశాం. వచ్చే నెలలో నర్సులు, పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం.
– నవీన్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment