
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పని తీరులో నూతనత్వం సంతరించుకోనుంది. కాగితాలు, ఫైళ్లతో పని లేకుండా అంతా ఈ–ఆఫీస్ పద్ధతిలో కార్యకలాపాలు జరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఈ–ఆఫీస్ నుంచే నిర్వహించాలని సీఎస్ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్లు, తపాల్స్ అన్నీ ఈ–ఆఫీస్, అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే జరగాలని, భౌతికంగా తీసుకోబడవని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల సీఎస్ జారీ చేశారు. ఈ–ఆఫీస్‌ను ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాౖలెనా ఇంతవరకు అమలు కాలేదు. ఈ–ఆఫీస్‌కు స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ శాఖలు, సచివాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఫిజికల్ విధానంలోనే జరుగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఫలితంగా సిబ్బంది శక్తి, ఉత్పాదకత, వనరులతో పాటు సమయం వృధా అవుతోందన్నారు. కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. శాఖాధిపతుల కార్యాలయాలు సమర్పిస్తున్న కొన్ని ప్రతిపాదనలు, ఏసీబీ కేసులు అందుబాటులో లేవన్న ఫిర్యాదులున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇ–ఆఫీస్‌ను నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి కఠినమైన మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పారు.
అసాధారణ కేసులకు సంబంధించి సంబంధిత కార్యదర్శి అనుమతి తీసుకుంటే తప్ప మిగతా కార్యాకలాపాలన్నీ జనవరి 1వ తేదీ నుంచి ఇ–ఆఫీస్ ద్వారానే కొనసాగించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సూచనలను చిత్తశుద్ధిలో అనుసరించాలని సీఎస్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇ – ఆఫీస్ నిర్వహణపై సాధారణ పరిపాలన శాఖ ఈ నెలాఖరు వరకు శాఖాధిపతులు, శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది.
ఇవీ మార్గదర్శకాలు..
► ఆమోదిత ముసాయిదా ప్రతుల కరస్పాండెన్స్‌లన్నింటీపై (జీవోలు మినహా) తప్పనిసరిగా సంబంధి అధికారి డిజిటల్ సంతకం ఉండాలి. ఆ ప్రతులను ఎంట్రీలో సూచించిన చిరునామాకు ఇ–ఆఫీస్‌లో ఇ–డిస్పాచ్‌లోనే పంపాలి. ఆమోదించిన ముసాయిదా ప్రతులను (జీవోలు మినహా) కూడా ఇడిస్పాచ్ ద్వారానే పంపాలి.
► ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలోనే జీవో నంబర్లను జనరేట్ చేయాలి. తుది జీవోను నంబర్‌తో పాటు సంతకం చేసిన స్కాన్డ్ కాపీలను ప్రభుత్వ అధికారిక ఇ–మెయిల్స్ ద్వారా మాత్రమే పంపించాలి.
► ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలు అన్ని ప్రతిపాదనలను తప్పనిసరిగా డిజిటల్ ఆకృతిలో (పీడీఎఫ్) ఇన్‌వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యూనికేషన్ విభాగం ఇ–మెయిల్ ఐడీ, ఇ–ఆఫీస్ వ్యవస్థలోని ఇ–డిస్పాచ్ ద్వారా లేదా అధికారిక ఇ–మెయిల్ ద్వారానే పంపాలి. భౌతిక ఆకృతిలో సమర్పించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోబడవు. డిజిటల్ ఫార్మాట్‌లో ప్రతిపాదనను సమర్పించడంలో జాప్యానికి సంబంధిత కార్యాలయమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అధికారిక ఇ–మెయిల్, ఇ–డిస్పాచ్ ద్వారా డిపార్ట్‌మెంట్‌లో స్వీకరించిన అన్ని ప్రతిపాదనలు, డిస్పాచ్ విభాగంలో సంబంధిత సిబ్బంది ఇ–రశీదులుగా మార్చి, వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపాలి.
► ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్లు కూడా నివేదికలను డిజిటల్ ఫార్మాట్‌లో ఏకకాలంలో ఏపీ విజిలెన్స్ కమిషన్‌కు, సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలి. రిఫరెన్స్ కోసం నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి స్థూలమైన భౌతిక నివేదికను పంపాలి.
► సచివాలయాల శాఖలన్నీ తప్పనిసరిగా అన్ని సాధారణ ఉత్తర ప్రత్యుతరాలు (కరస్పాండెన్స్‌లు) డిజిటల్ ఫార్మాట్‌లో ఇ–డిస్పాచ్ ద్వారా ఇన్‌వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యునికేషన్ విభాగాల అధికారికి పంపించాలి. డీవో లేఖలతో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలను సంబంధిత అధికారి అధికారిక ఇ–మెయిల్‌కు పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment