General Administration Department
-
కొత్త జిల్లాల్లో త్వరగా ఖాళీల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగే లోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం, అధికారాల బదిలీ, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ, ఎల్సీక్యూలపై సత్వరం సమాచారం అందించడం, తదితర అజెండా అంశాలపై సీఎస్ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ–ఆఫీస్ విధానం కింద ఇ–రశీదులు, ఇ–డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. ► త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖలు త్వరగా సమాధానాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఏసీబీ, విజిలెన్సు కేసులను నిరంతరం మానిటర్ చేస్తూ ఆయా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్న కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలి. కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి. దీనిపై త్వరలో జీపీలు, కార్యదర్శులతో వర్కషాపు నిర్వహిస్తాం. ► గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. -
ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ అప్లికేషన్‌కు అవసరమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించేందుకు సచివాలయంలోని అన్ని శాఖలు ఓ మిడిల్ లెవల్ ఆఫీసర్‌ను, శాఖాధిపతుల కార్యాలయాల్లో డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో సమాచారాన్ని అందించేందుకు జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌ను నోడల్ అధికారిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. నిర్దేశించిన నమూనా పత్రంలో నోడల్ అధికారి పేరు, హోదా, కార్యాలయం చిరునామా, మొబైల్ నంబర్, ఇ–మెయిల్ ఐడీని ఐటీ శాఖకు పంపాలని పేర్కొంది. ఐటీ శాఖ వెంటనే నోడల్ అధికారులను సంప్రదించి మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని, ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్లో ఎన్రోల్ అయ్యేందుకు అవసరమైన శిక్షణ కూడా నోడల్ అధికారులకు ఇవ్వాలని పేర్కొంది. ఉద్యోగుల సెలవుల నిర్వహణ కూడా ఈ వ్యవస్థలోనే ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇదే విధానంలో హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో జనవరి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమల్లోకి తెస్తుండగా మిగతా కార్యాలయాల్లో జనవరి 16 నుంచి అమల్లోకి తేనున్నారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు, రీజినల్, డివిజనల్, స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకు గల సబార్డినేట్ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులు కార్యాలయాల అధిపతులపైన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో హాజరు బాధ్యత జిల్లా కలెక్టర్లపైన ఉంటుందని స్పష్టం చేశారు. -
Andhra Pradesh: ఈ–ఆఫీస్ @ 2023.. మార్గదర్శకాలివే..!
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పని తీరులో నూతనత్వం సంతరించుకోనుంది. కాగితాలు, ఫైళ్లతో పని లేకుండా అంతా ఈ–ఆఫీస్ పద్ధతిలో కార్యకలాపాలు జరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఈ–ఆఫీస్ నుంచే నిర్వహించాలని సీఎస్ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్లు, తపాల్స్ అన్నీ ఈ–ఆఫీస్, అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే జరగాలని, భౌతికంగా తీసుకోబడవని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల సీఎస్ జారీ చేశారు. ఈ–ఆఫీస్‌ను ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాౖలెనా ఇంతవరకు అమలు కాలేదు. ఈ–ఆఫీస్‌కు స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ శాఖలు, సచివాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఫిజికల్ విధానంలోనే జరుగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా సిబ్బంది శక్తి, ఉత్పాదకత, వనరులతో పాటు సమయం వృధా అవుతోందన్నారు. కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. శాఖాధిపతుల కార్యాలయాలు సమర్పిస్తున్న కొన్ని ప్రతిపాదనలు, ఏసీబీ కేసులు అందుబాటులో లేవన్న ఫిర్యాదులున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇ–ఆఫీస్‌ను నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి కఠినమైన మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పారు. అసాధారణ కేసులకు సంబంధించి సంబంధిత కార్యదర్శి అనుమతి తీసుకుంటే తప్ప మిగతా కార్యాకలాపాలన్నీ జనవరి 1వ తేదీ నుంచి ఇ–ఆఫీస్ ద్వారానే కొనసాగించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సూచనలను చిత్తశుద్ధిలో అనుసరించాలని సీఎస్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇ – ఆఫీస్ నిర్వహణపై సాధారణ పరిపాలన శాఖ ఈ నెలాఖరు వరకు శాఖాధిపతులు, శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది. ఇవీ మార్గదర్శకాలు.. ► ఆమోదిత ముసాయిదా ప్రతుల కరస్పాండెన్స్‌లన్నింటీపై (జీవోలు మినహా) తప్పనిసరిగా సంబంధి అధికారి డిజిటల్ సంతకం ఉండాలి. ఆ ప్రతులను ఎంట్రీలో సూచించిన చిరునామాకు ఇ–ఆఫీస్‌లో ఇ–డిస్పాచ్‌లోనే పంపాలి. ఆమోదించిన ముసాయిదా ప్రతులను (జీవోలు మినహా) కూడా ఇడిస్పాచ్ ద్వారానే పంపాలి. ► ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలోనే జీవో నంబర్లను జనరేట్ చేయాలి. తుది జీవోను నంబర్‌తో పాటు సంతకం చేసిన స్కాన్డ్ కాపీలను ప్రభుత్వ అధికారిక ఇ–మెయిల్స్ ద్వారా మాత్రమే పంపించాలి. ► ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలు అన్ని ప్రతిపాదనలను తప్పనిసరిగా డిజిటల్ ఆకృతిలో (పీడీఎఫ్) ఇన్వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యూనికేషన్ విభాగం ఇ–మెయిల్ ఐడీ, ఇ–ఆఫీస్ వ్యవస్థలోని ఇ–డిస్పాచ్ ద్వారా లేదా అధికారిక ఇ–మెయిల్ ద్వారానే పంపాలి. భౌతిక ఆకృతిలో సమర్పించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోబడవు. డిజిటల్ ఫార్మాట్లో ప్రతిపాదనను సమర్పించడంలో జాప్యానికి సంబంధిత కార్యాలయమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారిక ఇ–మెయిల్, ఇ–డిస్పాచ్ ద్వారా డిపార్ట్మెంట్లో స్వీకరించిన అన్ని ప్రతిపాదనలు, డిస్పాచ్ విభాగంలో సంబంధిత సిబ్బంది ఇ–రశీదులుగా మార్చి, వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపాలి. ► ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు కూడా నివేదికలను డిజిటల్ ఫార్మాట్లో ఏకకాలంలో ఏపీ విజిలెన్స్ కమిషన్‌కు, సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలి. రిఫరెన్స్ కోసం నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి స్థూలమైన భౌతిక నివేదికను పంపాలి. ► సచివాలయాల శాఖలన్నీ తప్పనిసరిగా అన్ని సాధారణ ఉత్తర ప్రత్యుతరాలు (కరస్పాండెన్స్‌లు) డిజిటల్ ఫార్మాట్లో ఇ–డిస్పాచ్ ద్వారా ఇన్వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యునికేషన్ విభాగాల అధికారికి పంపించాలి. డీవో లేఖలతో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలను సంబంధిత అధికారి అధికారిక ఇ–మెయిల్‌కు పంపాలి. -
సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు సంతృప్తికరంగా లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. సమయపాలన పాటించమని అనేకసార్లు ఆదేశాలు జారీచేసినా ఫలితం ఉండటం లేదని పేర్కొంది. ఏపీ సచివాలయ ఆఫీస్ మాన్యువల్ నిబంధనల మేరకు కార్యాలయాలకు హాజరవడంలో సమయపాలన పాటించడం లేదని తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి సమయపాలన నిర్ధారించే బాధ్యత సంబంధిత విభాగాలపై ఉంటుందని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల అన్ని శాఖలకు జారీచేసిన మెమోలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శాఖలోనే ఓపీ సెక్షన్ ఇన్చార్జి రోజూ మధ్యాహ్నం 2 గంటల్లోపు సిబ్బంది హాజరును ఏకీకృతం చేయాలని మెమోలో సూచించింది. ఆ ఫైలును అదేరోజు సంబంధిత కార్యదర్శికి సమర్పించాలని పేర్కొంది. సమయపాలన పాటించనివారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ కార్యదర్శికి సూచించింది. ప్రస్తుతం సచివాలయంలో వారానికి ఐదురోజుల పనిదినాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం5.30 గంటల వరకు అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాల్లో ఉండాల్సి ఉంది. అయితే సోమవారం, శుక్రవారాలైతే సిబ్బందితో పాటు అధికారులు సమయపాలన సంతృప్తికి చాలా దూరంగా ఉంది. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు సిబ్బంది, అధికారుల హాజరు నమోదు చేస్తుండగా చాలా ఆశ్చర్యకర అంశాలు వెల్లడవుతున్నాయి. ఉదయం 11 గంటలకు 70 నుంచి 75 శాతం ఉంటున్న సచివాలయ ఉద్యోగుల హాజరు సాయంత్రం 5 గంటలకు 40 నుంచి 45 శాతానికి మించి ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే సాధారణ పరిపాలన శాఖ మధ్యాహ్నం 2 గంటలకే హాజరు వివరాలను సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలని, సమయపాలన పాటించని ఉద్యోగులపై కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్న సీఎస్ సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరును పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని సాధారణ పరిపాలన శాఖ జారీచేసిన మెమోలో తెలిపింది. -
విశిష్ట సేవకులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు
సాక్షి, అమరావతి: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన.. ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు. కాగా, ఏయే రంగాల్లో వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించింది. అవి.. ఏయే రంగాల్లో... ఏయే రంగాల్లో విశిష్ట ప్రజాసేవలు అందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారో కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ముఖ్యమైనవి. సోషల్ వర్క్: సామాజిక, సేవా రంగాలు, సామాజిక ప్రాజెక్టులకు అందించిన సేవలు. ప్రజావ్యవహారాలు: న్యాయ, రాజకీయ, ప్రజాసేవలు సైన్స్, ఇంజినీరింగ్: స్పేస్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాల్లో పరిశోధన, అభివృద్ధి. వ్యాపార వాణిజ్య రంగాలు : బ్యాకింగ్, ఆర్థిక వ్యవహారాలు, టూరిజం, వాణిజ్య నిర్వహణ, విస్తరణ. ప్రింట్ మీడియా: విశిష్ట సేవలు అందించిన ఎడిటర్స్, జర్నలిస్టులు. ఎలక్ట్రానిక్ మీడియా: విశిష్ట సేవలు అదించిన వారు వైద్య రంగం: ఆయుర్వేద, హోమియో, సిద్ధ, అల్లోపతి, ప్రకృతి వైద్యం (నేచురోపతి) రంగాల్లో పరిశోధకులు. కళలు, సాహిత్యం, విద్య: జర్నలిజంతో సహా కళలు, సాహిత్యం, విద్యా రంగాల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధన, విద్యా విస్తరణ, సంస్కరణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు ప్రజాసేవ: పరిపాలన రంగంలో ప్రజలకు అత్యుత్తమ, అసాధారణ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు. క్రీడారంగం: ప్రసిద్ధ కీడ్రలు, అథ్లెటిక్స్, పర్వతారోహకులు, యోగా, క్రీడల విస్తరణకు పాటుపడ్డ వారు. వీటితోపాటు ఇందులో ప్రస్తావించని సంస్కృతి, మానవ హక్కులు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని కూడా ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. కమిటీ ద్వారా ఎంపిక పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీస్తుంది. ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) అధ్యక్షతన గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మూడు శాఖల కార్యదర్శులు సభ్యులుగానూ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మధ్య స్థాయి అధికారి కన్వీనరుగాను ఉంటారు. అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారుచేసి ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తుంది. ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరిస్తారు. ఏడాదికి వంద అవార్డులు మించకుండా ఇస్తారు. కాగా, 2020 సంవత్సరం నుంచి ప్రతియేటా ఈ అవార్డులు ఇస్తారు. -
గౌరవంగా తప్పుకుంటే సరేసరి.. లేదంటే..!
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం అన్ని శాఖల్లో నియమించిన సలహాదారులు, చైర్పర్సన్లు, చైర్మన్లు, నిపుణులు, కన్సల్టెంట్లును తొలగించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వారంతా గౌరవంగా తప్పుకుంటే సరేసరని.. లేదంటే తొలగిస్తూ సంబంధిత శాఖలు ఆదేశాలు జారీచేయాలని సిసోడియా తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇప్పటికీ చాలామంది ఇలా కొనసాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. అలాంటి వారిని తక్షణం తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు హయాంలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల పేరుతో సంబంధిత శాఖల్లో నిపుణుల పేరుతో అనేకమందిని ఎక్కువ వేతనాలకు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినా ఇంకా వారు కొనసాగడంపట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖ అయితే ఏకంగా ఆయా మిషన్లలో పనిచేసే వారికి నిధులు కావాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు పంపడం గమనార్హం. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అయితే ప్రభుత్వం మారినప్పటికీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఇంకా కొనసాగుతున్నారు. ఆర్టీసీ భవన్‌కు రాకుండానే ప్రభుత్వ వాహనాలను వినియోగించుకుంటున్నారు. సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో లక్షల్లో వేతనాలు తీసుకుంటూ కన్సల్టెంట్లు ఇప్పటికీ కొనసాగుతున్నారు. -
రెవెన్యూలో పెరిగిన పనిభారం
సాక్షి, అమరావతి: తీవ్రంగా పెరిగిన పనిభారంతో రెవెన్యూ ఉద్యోగుల తలబొప్పి కడుతోంది. పనిభారం రెట్టింపయినా ఉద్యోగులను మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు. ఉన్న ఖాళీల భర్తీకి కూడా చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సుమారు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ‘1986లో తాలూకాల స్థానంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండల వ్యవస్థను తెచ్చింది. ఒక్కో తాలూకా రెండు మూడు మండలాలు అయ్యాయి. ఉన్న ఉద్యోగులనే మండలాలకు సర్దుబాటు చేసింది కానీ పోస్టుల సంఖ్య పెంచలేదు. గత 32 ఏళ్లలో జనాభా పెరిగింది. కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, రకరకాల నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ), పంచనామాలు లాంటి విధులు పెరిగాయి. ఇవేకాకుండా ఓటర్ల జాబితాల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, ప్రజాసాధికార సర్వే, గ్రామసభలు, జన్మభూమి సభలు, రైల్వే, రోడ్లు, పరిశ్రమలు తదితరాలకు భూసేకరణ లాంటి పనులు రెట్టింపయ్యాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా రెవెన్యూ శాఖనే ముందుగా కనిపిస్తోంది. చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులు వచ్చాయో? రాలేదో? డీలర్లు వీటిని పంపిణీ చేశారో? లేదో రెవెన్యూ ఇన్స్పెక్టర్లే చూడాలి. వాస్తవంగా ఇందులో చాలా పనులు రెవెన్యూ శాఖకు సంబంధం లేనివి. అయితే ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రతి పనికీ రెవెన్యూతోనే లింకు పెట్టి భారం మోపుతోంది’ అని క్షేత్రస్థాయి ఉన్నతాధికారులు చెబుతున్నారు. బరువు మోపేందుకేనా? ‘అన్ని విధులూ మా నెత్తిన పెట్టడానికైతే రెవెన్యూ కీలకమని సర్కారు చెబుతోంది.. పేరుకు రెవెన్యూ శాఖ అయినా చేసేది మాత్రం సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలే. మమ్మల్ని సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల్లా గుర్తించాలంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఏ విధంగానూ రెవెన్యూ శాఖకు సంబంధం లేని వ్యవహారం. అయినా ప్రభుత్వం దీనికీ మమ్మల్నే బాధ్యులను చేసింది. రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువగా వ్యక్తిగత మరుగుదొడ్ల టార్గెట్లు సాధించడంపైనే దృష్టి పెట్టారు. దీంతో ఇతర రెవెన్యూ పనులన్నీ పెండింగులో పడిపోయాయి’ అని ఒక జిల్లా జాయింట్ కలెక్టర్ వాపోయారు. సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులుగా గుర్తించాలి రెవెన్యూ ఉద్యోగులు సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల్లా అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాకు కలెక్టరేట్ అనేది జిల్లా సచివాలయం. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లు ఇక్కడకు వస్తాయి. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అనేది డివిజన్‌కు సచివాలయం లాంటిది. అందువల్ల రెవెన్యూ ఉద్యోగులను సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులుగా గుర్తించి ప్రత్యేక స్కేల్ ఇవ్వాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సీసీఎల్ఏలో ఉంది. త్వరగా దీన్ని ఆమోదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. -
నేడు మాజీ సీఎస్ ప్రదీప్‌చంద్రకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు సచివాలయంలో బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. డీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఉద్యోగులు హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. -
అక్టోబర్ 3.. వెలగపూడి నుంచే పరిపాలన
* అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు * ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని సూచన సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన సాగించాలని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) మంగళవారం అన్ని శాఖల కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అక్టోబర్ 3వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసిం ది. సచివాలయ ఉద్యోగులంతా అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో పనిచేయాల్సి ఉన్నం దున ఫైళ్లు, కంప్యూటర్లను హైదరాబాద్ నుంచి తరలించేందుకు ప్యాకింగ్ చేయాలని జీఏడీ సూచించింది. ఈ నెల 21వ తేదీ నుంచే తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.. హా ఈ నెల 30వ తేదీకల్లా హైదరాబాద్ సచివాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లను వెలగపూడికి తరలించాలి. హా వచ్చే నెల 1, 2 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనందున 3 నుంచి పూర్తిస్థాయిలో వెలగపూడి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు గడువులోగా ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలి. హా హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు బదిలీ రవాణా భత్యం(టీటీఏ) వర్తిస్తుంది. హా తాత్కాలిక సచివాలయంలో సెంట్రల్ రికార్డ్ సిస్టమ్ (సీఆర్ఎస్)ను ఏర్పాటు చేసిన తర్వాతే హైదరాబాద్‌లో ఉన్న సీఆర్ఎస్ను వెలగపూడికి తరలిస్తారు. ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ కోసం జీఏడీ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటవుతుంది. హా హైకోర్టు, లోకాయుక్త, ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) వంటి చట్టబద్ధ సంస్థల వ్యవహారాలను చూసేందుకు ఒక్కో విభాగం నుంచి అవసరాన్ని బట్టి ఒకరిద్దర్ని ఇక్కడే ఉంచేలా జీఏడీ కార్యదర్శి చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు సచివాలయ తరలింపు షెడ్యూల్, మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఒక్క ఇంటికే అద్దె అలవెన్స్!
హైదరాబాద్, అమరావతి..రెండుచోట్లా కుదరదన్న సీఎం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు ఎక్కడైనా ఒకచోట ఇంటికి మాత్రమే అద్దె అలవెన్స్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి కొత్త రాజధాని అమరావతి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులు హైదరాబాద్, అమరావతి.. రెండుచోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అఖిల భారత సర్వీసు అధికారులు కొందరు అమరావతి, హైదరాబాద్‌లోనూ నివాసముంటున్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ పరిపాలన శాఖ కొత్త రాజధానిలో కూడా అఖిల భారత సర్వీసు అధికారులకు ఇంటి అద్దె అలవెన్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ఫైలును పరిశీలించిన సీఎం.. రెండు చోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఇటీవల తిరస్కరించారు. రూ.500 కోట్ల భారం: అఖిల భారత సర్వీసు అధికారులకు రెండు చోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తే ఉద్యోగులకూ ఇవ్వాల్సి వస్తుందని, ఇదంతా కలిపి ఏడాదికి అదనంగా రూ.500 కోట్ల భారం పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం హైదరాబాద్‌లో వసతి కల్పించినందున అమరావతిలో ఇంటి అద్దె అలవెన్స్‌ను మంజూరు చేయదు. ముఖ్యమంత్రికి మాత్రం ఎన్ని చోట్లైనా... సీఎంకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఆయనకు హైదరాబాద్‌లో ఇంటికి, లేక్‌వ్యూ అతిథి గృహంలోని క్యాంపు కార్యాలయానికి వేర్వేరుగా అలవెన్స్‌లను సాధారణ పరిపాలన శాఖ చెల్లిస్తోంది. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కు, గుంటూరు జిల్లాలోని లింగమనేని ఎస్టేట్‌లో సీఎం ఇంటికి, క్యాంపు ఆఫీస్‌కు వేర్వేరుగా ప్రతినెలా లక్షల్లో అలవెన్స్ మంజూరవుతోంది.