సాక్షి, అమరావతి: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన.. ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు. కాగా, ఏయే రంగాల్లో వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించింది. అవి..
ఏయే రంగాల్లో...
ఏయే రంగాల్లో విశిష్ట ప్రజాసేవలు అందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారో కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ముఖ్యమైనవి.
సోషల్ వర్క్: సామాజిక, సేవా రంగాలు, సామాజిక ప్రాజెక్టులకు అందించిన సేవలు.
ప్రజావ్యవహారాలు: న్యాయ, రాజకీయ, ప్రజాసేవలు
సైన్స్, ఇంజినీరింగ్: స్పేస్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాల్లో పరిశోధన, అభివృద్ధి.
వ్యాపార వాణిజ్య రంగాలు : బ్యాకింగ్, ఆర్థిక వ్యవహారాలు, టూరిజం, వాణిజ్య నిర్వహణ, విస్తరణ.
ప్రింట్ మీడియా: విశిష్ట సేవలు అందించిన ఎడిటర్స్, జర్నలిస్టులు.
ఎలక్ట్రానిక్ మీడియా: విశిష్ట సేవలు అదించిన వారు
వైద్య రంగం: ఆయుర్వేద, హోమియో, సిద్ధ, అల్లోపతి, ప్రకృతి వైద్యం (నేచురోపతి) రంగాల్లో పరిశోధకులు.
కళలు, సాహిత్యం, విద్య: జర్నలిజంతో సహా కళలు, సాహిత్యం, విద్యా రంగాల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధన, విద్యా విస్తరణ, సంస్కరణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు
ప్రజాసేవ: పరిపాలన రంగంలో ప్రజలకు అత్యుత్తమ, అసాధారణ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు.
క్రీడారంగం: ప్రసిద్ధ కీడ్రలు, అథ్లెటిక్స్, పర్వతారోహకులు, యోగా, క్రీడల విస్తరణకు పాటుపడ్డ వారు. వీటితోపాటు ఇందులో ప్రస్తావించని సంస్కృతి, మానవ హక్కులు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని కూడా ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.
కమిటీ ద్వారా ఎంపిక
పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీస్తుంది. ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) అధ్యక్షతన గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మూడు శాఖల కార్యదర్శులు సభ్యులుగానూ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మధ్య స్థాయి అధికారి కన్వీనరుగాను ఉంటారు. అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారుచేసి ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తుంది. ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరిస్తారు. ఏడాదికి వంద అవార్డులు మించకుండా ఇస్తారు. కాగా, 2020 సంవత్సరం నుంచి ప్రతియేటా ఈ అవార్డులు ఇస్తారు.
విశిష్ట సేవకులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు
Published Thu, Nov 7 2019 5:18 AM | Last Updated on Thu, Nov 7 2019 5:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment