ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మొబైల్ అప్లికేషన్‌కు అవసరమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించేందుకు సచివాలయంలోని అన్ని శాఖలు ఓ మిడిల్ లెవల్ ఆఫీసర్‌ను, శాఖాధిపతుల కార్యాలయాల్లో డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో సమాచారాన్ని అందించేందుకు జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌ను నోడల్ అధికారిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది.
నిర్దేశించిన నమూనా పత్రంలో నోడల్ అధికారి పేరు, హోదా, కార్యాలయం చిరునామా, మొబైల్ నంబర్, ఇ–మెయిల్ ఐడీని ఐటీ శాఖకు పంపాలని పేర్కొంది. ఐటీ శాఖ వెంటనే నోడల్ అధికారులను సంప్రదించి మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని, ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్‌లో ఎన్‌రోల్ అయ్యేందుకు అవసరమైన శిక్షణ కూడా నోడల్ అధికారులకు ఇవ్వాలని పేర్కొంది. ఉద్యోగుల సెలవుల నిర్వహణ కూడా ఈ వ్యవస్థలోనే ఉంటుందని పేర్కొంది.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇదే విధానంలో హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో జనవరి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమల్లోకి తెస్తుండగా మిగతా కార్యాలయాల్లో జనవరి 16 నుంచి అమల్లోకి తేనున్నారు.
స్వయంప్రతిపత్తి గల సంస్థలు, రీజినల్, డివిజనల్, స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామ స్థాయి వరకు గల సబార్డినేట్ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులు కార్యాలయాల అధిపతులపైన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో హాజరు బాధ్యత జిల్లా కలెక్టర్లపైన ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment