
ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ప్రస్తుత సీఎస్ డా.కేఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తూ నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ను సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబర్ టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సీఎస్‌లు గోపాల కృష్ణ ద్వివేది, రజత్ భార్గవ, కె.విజయానంద్, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె.సునీత, ప్రవీణ్ ప్రకాశ్, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment