Nirab Kumar Prasad
-
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఎల్. సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా నియమించారు.ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద సుబ్బారాయుడు ఓఎస్డీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఆయన్ని డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపింది. బదిలీ చేసిన వారిలో 28 మందికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మిగిలిన 9 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. -
కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ప్రస్తుత సీఎస్ డా.కేఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తూ నీరబ్కుమార్ప్రసాద్ను సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబర్ టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సీఎస్‌లు గోపాల కృష్ణ ద్వివేది, రజత్ భార్గవ, కె.విజయానంద్, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె.సునీత, ప్రవీణ్ ప్రకాశ్, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులున్నారు. -
ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
పీఎం వీడియో కాన్ఫరెన్స్ ఇంచార్జి సీఎస్
సాక్షి, అమరావతి: అన్నిరాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంచార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. ఇంచార్జ్ సీఎస్ తోపాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తాజాగా బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. -
హెచ్ఎండీఏకు షాక్!
సాక్షి, హైదరాబాద్: అక్రమాల పుట్టగా అపకీర్తిని మూటగట్టుకున్న మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అధికారాలకు కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్రమార్కుల చర్యల వల్ల నగర శివార్లలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకుండా పోతున్నాయని పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్‌పై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలని, త్వరితగతిన అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఆయన యోచిస్తున్నారు. వారం, పది రోజుల్లో అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. కొత్త పరిశ్రమలకు సంబంధించి భూ వినియోగం, బిల్డింగ్ ప్లాన్లు, రోడ్లు తదితరాలకు అనుమతులిచ్చే అధికారాన్ని హెచ్ఎండీఏ నుంచి తప్పించి... పరిశ్రమల శాఖకు కట్టబెట్టాలని ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు వినికిడి. హెచ్ఎండీఏ అధికారాల కుదింపులో సాంకేతిక ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై ఉన్నత స్థాయిలో అధ్యయనం సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త వాటికి పరిశ్రమల శాఖ అనుమతులిస్తుంది గనుక భవనాల ప్లాన్లు, భూ వినియోగం వంటి వాటికీ ఆ శాఖే అనుమతులిస్తే కాలం, ఖర్చు కలిసి వస్తుందని అధికారుల యోచన. సమస్యలు ఎదురైన అక్కడే పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం. సింగిల్ విండో విధానం.. హెచ్ఎండీఏలో ఏ అనుమతి కావాలన్నా చేయి తడపనిదే ఫైల్ కదలదన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు సింగిల్ విండో విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులిచ్చేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశించి, పక్కాగా అమలుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశ్రమల శాఖలోనే పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే సత్వరం అనుమతులు ఇవ్వాలనుకుంటోంది. దీని వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతమై, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. సాధ్యమేనా? హెచ్ఎండీఏ అధికారాలను కుదింపు అనుకున్నంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది. ‘హెచ్ఎండీఏ యాక్టు’ను సవరించకుండా అధికారాల కుదింపు, బదలాయింపు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి చేస్తూ గతంలో చట్టం చేశారు. పరిశ్రమల జోన్లోనే కొత్త వాటికి అనుమతిచ్చేలా నిబంధన పెట్టారు. ఆ అధికారం పరిశ్రమల శాఖకు ఇచ్చినా... భూ వినియోగానికి ఆ ఫైల్ విధిగా హెచ్ఎండీఏకు వెళ్లాల్సిందే. లేదంటే ఎవరి ఇష్టమొచ్చిన చోట వారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాలుష్యం పెరిగి, ప్రజా జీవనమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తలుచుకొంటే చట్టాన్ని సవరించి అధికారాలను కుదించడం పెద్ద సమస్య కాదన్న మరో వాదన కూడా ఉంది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.