సాక్షి, హైదరాబాద్: అక్రమాల పుట్టగా అపకీర్తిని మూటగట్టుకున్న మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారాలకు కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్రమార్కుల చర్యల వల్ల నగర శివార్లలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకుండా పోతున్నాయని పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్‌పై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలని, త్వరితగతిన అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఆయన యోచిస్తున్నారు. వారం, పది రోజుల్లో అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. కొత్త పరిశ్రమలకు సంబంధించి భూ వినియోగం, బిల్డింగ్ ప్లాన్లు, రోడ్లు తదితరాలకు అనుమతులిచ్చే అధికారాన్ని హెచ్‌ఎండీఏ నుంచి తప్పించి... పరిశ్రమల శాఖకు కట్టబెట్టాలని ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు వినికిడి.
హెచ్‌ఎండీఏ అధికారాల కుదింపులో సాంకేతిక ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై ఉన్నత స్థాయిలో అధ్యయనం సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త వాటికి పరిశ్రమల శాఖ అనుమతులిస్తుంది గనుక భవనాల ప్లాన్లు, భూ వినియోగం వంటి వాటికీ ఆ శాఖే అనుమతులిస్తే కాలం, ఖర్చు కలిసి వస్తుందని అధికారుల యోచన. సమస్యలు ఎదురైన అక్కడే పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం.
సింగిల్ విండో విధానం..
హెచ్‌ఎండీఏలో ఏ అనుమతి కావాలన్నా చేయి తడపనిదే ఫైల్ కదలదన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు సింగిల్ విండో విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులిచ్చేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశించి, పక్కాగా అమలుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశ్రమల శాఖలోనే పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే సత్వరం అనుమతులు ఇవ్వాలనుకుంటోంది. దీని వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతమై, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు.
సాధ్యమేనా?
హెచ్‌ఎండీఏ అధికారాలను కుదింపు అనుకున్నంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది. ‘హెచ్‌ఎండీఏ యాక్టు’ను సవరించకుండా అధికారాల కుదింపు, బదలాయింపు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి చేస్తూ గతంలో చట్టం చేశారు. పరిశ్రమల జోన్‌లోనే కొత్త వాటికి అనుమతిచ్చేలా నిబంధన పెట్టారు.
ఆ అధికారం పరిశ్రమల శాఖకు ఇచ్చినా... భూ వినియోగానికి ఆ ఫైల్ విధిగా హెచ్‌ఎండీఏకు వెళ్లాల్సిందే. లేదంటే ఎవరి ఇష్టమొచ్చిన చోట వారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాలుష్యం పెరిగి, ప్రజా జీవనమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తలుచుకొంటే చట్టాన్ని సవరించి అధికారాలను కుదించడం పెద్ద సమస్య కాదన్న మరో వాదన కూడా ఉంది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.
హెచ్‌ఎండీఏకు షాక్!
Published Mon, Oct 6 2014 12:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM
Advertisement