ఆర్‌పి సిసోడియా
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం అన్ని శాఖల్లో నియమించిన సలహాదారులు, చైర్‌పర్సన్లు, చైర్మన్లు, నిపుణులు, కన్సల్టెంట్లును తొలగించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఆర్‌పి సిసోడియా ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వారంతా గౌరవంగా తప్పుకుంటే సరేసరని.. లేదంటే తొలగిస్తూ సంబంధిత శాఖలు ఆదేశాలు జారీచేయాలని సిసోడియా తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇప్పటికీ చాలామంది ఇలా కొనసాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. అలాంటి వారిని తక్షణం తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
చంద్రబాబు హయాంలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల పేరుతో సంబంధిత శాఖల్లో నిపుణుల పేరుతో అనేకమందిని ఎక్కువ వేతనాలకు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినా ఇంకా వారు కొనసాగడంపట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖ అయితే ఏకంగా ఆయా మిషన్లలో పనిచేసే వారికి నిధులు కావాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు పంపడం గమనార్హం. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అయితే ప్రభుత్వం మారినప్పటికీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఇంకా కొనసాగుతున్నారు. ఆర్టీసీ భవన్‌కు రాకుండానే ప్రభుత్వ వాహనాలను వినియోగించుకుంటున్నారు. సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో లక్షల్లో వేతనాలు తీసుకుంటూ కన్సల్టెంట్లు ఇప్పటికీ కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment