ఏపీలో భారీగా తగ్గిన పీజీ వైద్య విద్య ఫీజులు | Hugely reduced PG medical education fees in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా తగ్గిన పీజీ వైద్య విద్య ఫీజులు

Published Sat, May 30 2020 3:46 AM | Last Updated on Sat, May 30 2020 9:56 AM

Hugely reduced PG medical education fees in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం భారీగా తగ్గించింది. 2020–21 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్యార్థుల అడ్మిషన్లు దగ్గర పడిన నేపథ్యంలో ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వైద్య కళాశాలల్లో భారీగా ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ వైద్య సీట్లతోపాటు పీజీ దంత వైద్య సీట్ల ఫీజులనూ తగ్గించడం విశేషం. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా ఇలా అన్నింటిలోనూ ఫీజులను తగ్గించింది.

డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదని, పేద, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి విద్యార్థులకు కూడా పీజీ వైద్య విద్య అందుబాటులో ఉండాలని వివిధ కేటగిరీల్లో 40 నుంచి 50 శాతం మేరకు ఫీజులను కుదించింది. సర్కార్‌ తాజా నిర్ణయంతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర పలికే యాజమాన్య కోటా సీటు ఫీజు లక్షల్లోకి తగ్గిపోయింది. కన్వీనర్‌ కోటా సీట్లకు సైతం ఏడాదికి రూ.7.60 లక్షలున్న ఫీజు కూడా దాదాపు సగానికి పడిపోయింది. కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారీ లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఓపెన్‌ కేటగిరీలో సీటు పొందిన రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థి స్లైడింగ్‌ (వేరే సీటుకు మారితే)కు వెళ్తే ఖాళీ అయిన సీటును అదే రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థికి కేటాయిస్తారు. ఇంతకుముందు వరకు ఇలా లేకపోవడంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీ అభ్యర్థులు నష్టపోయారు. 


ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు
► మైనారిటీ, నాన్‌ మైనారిటీ, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ అన్ని కళాశాలల్లో ఒకే తరహా ఫీజులు
► 2020–21 నుంచి 2022–23 వరకూ ఈ ఫీజులు అమల్లో ఉంటాయి.
► ఏపీ ఫీ రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదించిన మేరకు ఫీజుల నిర్ణయం
► ట్యూషన్‌ ఫీజు, అడ్మిషన్‌ ఫీజు, స్పెషల్‌ ఫీజు, లేబొరేటరీ/లైబ్రరీ, కంప్యూటర్‌/ఇంటర్నెట్, నిర్వహణ ఫీజులన్నీ కలిపే కొత్త ఫీజులు
► వార్షిక ఫీజును ఆయా కళాశాలలు రెండు దఫాలుగా వసూలు చేయొచ్చు.
► ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు
► ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే పీజీ వైద్య విద్యార్థులకు ఎంత స్టైఫండ్‌ ఇస్తున్నారో ప్రైవేటు కళాశాలలూ అంతే ఇవ్వాలి.
► ఫీజుల వసూళ్లపై ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉంటుంది.

ఈ ఏడాది పీజీ వైద్య విద్య అడ్మిషన్లు నిలిపేస్తున్నాం
పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పీజీ వైద్య విద్య, పీజీ డెంటల్‌ అడ్మిషన్లు నిలిపేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కళాశాలల పనితీరు, ఖాతాల నిర్వహణ చూడకుండానే ఫీజులు నిర్ణయించడం బాధాకరమని పేర్కొంది. విద్యార్థులు చెల్లించే ఫీజుల కంటే ఏడాదికి విద్యార్థులకు తాము చెల్లించే స్టైఫండే అధికంగా ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో తాము అడ్మిషన్లు చేయలేమని, అందుకే నిలిపివేస్తున్నట్టు వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement