తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈవోతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
గరుడోత్సవం రోజున శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను అందజేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ ఆహ్వానించనుందని వెల్లడించారు. దీంతోపాటు హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తనలు పాటలు పోటీలను ‘అదివో అల్లదివో’ పేరుతో నిర్వహించనున్నట్లు చెప్పారు.
అన్నమయ్య సంకీర్తనలపై నిరంతర పరిశోధనలు
అన్నమాచార్యుల సంకీర్తనలపై నిరంతరం పరిశోధనలు నిర్వహించేందుకు తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘అన్నమయ్య పీఠం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment