
సాక్షి, అమరావతి: ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 18 నుంచి 26 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 18 నుంచి 31 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్‌ఐ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 21 నుంచి 29 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 21 నుంచి 34 ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 6,100 కానిస్టేబుల్, 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు తాజాగా వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల మరింత మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది.