
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతికతతో బలోపేతమైన పోలీసు వ్యవస్థ.. పెరిగిన భద్రత.. తగ్గిన నేరాలు.. నేరస్తులకు సత్వర శిక్షలు.. వెరసి ప్రజలకు పూర్తి భరోసా.. ఇదీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు. శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ప్రజల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న వినూత్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. దిశ యాప్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేస్తోంది.
రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, భద్రత పెరిగిందని జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. పూర్తి భద్రతతో ప్రజలు సంతోషంగా ఉండటం మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. టీడీపీకి కొమ్ముకాసే పచ్చ పత్రికలకూ కంటగింపుగా మారింది. అందుకే రాష్ట్రంలో భద్రతపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు.
విశాఖపట్నంలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ను గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి కిడ్నాపర్లను అరెస్టు చేయడం పట్ల అంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కానీ పచ్చ మీడియా మాత్రం వక్రీకరణలతో అక్కసు వెళ్లగక్కుతుండటం దిగజారుడు పాత్రికేయ విలువలకు అద్దం పడుతోంది. కానీ ఎన్‌సీఆర్‌బీ నివేదికలు, ప్రజల సంతృప్తికర స్థాయి అసలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి.
శాంతిభద్రతలు భేష్
గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేసింది. రాష్ట్ర స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఎక్కడా సరైన పర్యవేక్షణ, జవాబుదారీతనం ఉండేవి కావు. దాంతో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అల్లరి మూకలు, రౌడీ గ్యాంగ్‌లు, కరడుగట్టిన నేరస్తులు చెలరేగిపోయారు. నేరాల రేటు పెరుగుతున్నా సరే నియంత్రణ చర్యలే లేకుండా పోయాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. నేరాల కట్టడికి పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. తత్ఫలితంగా రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు గణనీయంగా తగ్గాయి. అందుకు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలే నిదర్శనం.
మహిళా భద్రతకు దిశా నిర్దేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ ప్రవేశపెట్టిన దిశ యాప్, దిశ వ్యవస్థ మహిళా భద్రతకు పూర్తి భరోసానిస్తున్నాయి. దిశ యాప్ ద్వారా ఎవరైనా సంప్రదించిన 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.24 లక్షల ఎస్‌వోఎస్ కాల్స్ వచ్చాయి.
కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్ బటన్ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గ 28,585 కాల్స్ వచ్చాయి. వీటికి పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 2,300 మంది మహిళలకు తక్షణం భద్రత కల్పించారు. 423 మందిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చారు. దిశ యాప్ ద్వారా సగటున రోజూ 250 కాల్స్ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment