‘విజిలెన్స్’కు సమాచారం ఇచ్చేవారికి భద్రత పేరుతో ఎత్తుగడ
నోడల్ అధికారిగా ఇంటెలిజెన్స్ చీఫ్
సాక్షి, అమరావతి: అస్మదీయులు, టీడీపీ నేతలకు అడ్డదారిలో పోలీసు భద్రత కల్పించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఓ వైపు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కల్పించాల్సిన భద్రతను కుదిస్తూ... మరోవైపు తమ అనుయాయులైన ప్రైవేటు వ్యక్తులకు మాత్రం ప్రజాధనం వెచ్చించి మరీ పోలీసు భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కొత్త ఎత్తుగడకు తెరతీసింది. విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసేవారికి పోలీసు భద్రత కల్పిస్తామని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల వ్యవహారాల్లో అవినీతిపై ఫిర్యాదు చేసేవారికి భద్రత కల్పిస్తామని ప్రకటించింది.
భద్రతా అంశంపై నిర్ణయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌కు కట్టబెట్టింది. ఈమేరకు అదనపు డీజీ(ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్హాను నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణ పరిధిలోని వస్తారు. సీఎంకు కళ్లు, చెవులుగా వ్యవహరించడమే ఆయన బాధ్యత. అంటే సీఎం ఎవరికి చెబితే వారికి పోలీసు భద్రత కల్పిస్తారన్నది సుస్పష్టం.
ఆ ముసుగులో రాష్ట్రంలోని టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ప్రైవేటు వ్యక్తులకు పోలీసు భద్రత కల్పించేందుకు ఎత్తుగడ వేశారు. ప్రజాధనం వెచ్చిస్తూ తమ అస్మదీయులకు పోలీసు భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాదు... ఆ ముసుగులో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సంఘ విద్రోహ శక్తులకు కూడా పోలీసు భద్రత కల్పించేందుకు ప్రణాళిక రచించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment