Vigilance Commission
-
‘కాళేశ్వరం బాధ్యుల’పై చర్యలకు విజిలెన్స్ ఓకే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన నివేదికను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ ఆమోదించింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీకైన విషయం తెలిసిందే. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించగా.. బరాజ్‌ల వైఫల్యానికి 40 మందికి పైగా ఇంజనీర్లు, ఇతర అధికారులు బాధ్యులని తేల్చుతూ, వారిపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. ఈ నివేదికను తాజాగా విజిలెన్స్ కమిషన్ ఆమోదించడంతో.. బాధ్యులైన ఇంజనీర్లు, ఇతర అధికారులపై చర్యలకు మార్గం సుగమమైంది. బాధ్యులైన అధికారుల జాబితాలో కొందరు ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లతో పాటు పలువురు మాజీ ఈఎన్సీల పేర్లు సైతం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిని రక్షించడానికి కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నతాధికార వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఓ అండ్ ఎం వైఫల్యంతోనే.. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో సాంకేతిక తప్పిదాలు చోటుచేసుకున్నాయని, బరాజ్ పునాదుల కింద రక్షణగా ఉండే సికెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలతోనే 7వ బ్లాక్ కుంగిపోయిందని విజిలెన్స్ నిర్థారించినట్టు తెలిసింది. ఇక బరాజ్‌ల పనులు పూర్తికాక ముందే పూర్తైనట్టు నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం నేరపూరిత చర్య అని పేర్కొంది. బ్యాంక్ గ్యారెంటీల విడుదలలో సైతం నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించేలా వ్యవహరించినట్టు తప్పుబట్టినట్లు సమాచారం. మేడిగడ్డ బరాజ్ 2019లో వినియోగంలోకి రాగా అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ బ్లాకులు (అప్రాన్) కొట్టుకుపోగా, మూడేళ్ల పాటు మరమ్మతులు నిర్వహించకుండా ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్ (ఓ అండ్ ఎం) విభాగం నిర్లక్ష్యం చేయడంతోనే 2022 అక్టోబర్‌లో బరాజ్ కుంగిందని పేర్కొంది. ఏటా వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత బరాజ్ స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను తయారు చేయాల్సి ఉండగా, నాటి రామగుండం ఈఎన్సీ నిర్వహించలేదని తప్పుబట్టినట్లు తెలిసింది. నిర్మాణం పూర్తైన తర్వాత లోపలి భాగంలో షీట్‌పైల్స్‌తో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్‌ను తొలగించక పోవడంతో నది సహజ ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్‌పై ఒత్తిడి పెంచిందని అభిప్రాయపడింది. ఈ విషయంలో నిర్మాణ సంస్థతో పాటు రామగుండం మాజీ ఈఎన్సీ, ఎస్ఈ, ఈఈలే బాధ్యులని తేల్చినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్‌కు విజిలెన్స్ నివేదిక బరాజ్‌ల వైఫల్యాలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తమ నివేదికను అందించింది. ఈ నెల 20 తర్వాత జస్టిస్ ఘోష్ హైదరాబాద్‌కు చేరుకుని సాక్షుల తుది దఫా క్రాస్ ఎగ్జామినేషన్ జరపనున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు లేఖ రాసి, క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొనడం ద్వారా కమిషన్‌కు సహకరించాలని కోరనున్నట్టు తెలిసింది. -
అస్మదీయులకు అడ్డదారిలో పోలీసు భద్రత
సాక్షి, అమరావతి: అస్మదీయులు, టీడీపీ నేతలకు అడ్డదారిలో పోలీసు భద్రత కల్పించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఓ వైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కల్పించాల్సిన భద్రతను కుదిస్తూ... మరోవైపు తమ అనుయాయులైన ప్రైవేటు వ్యక్తులకు మాత్రం ప్రజాధనం వెచ్చించి మరీ పోలీసు భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కొత్త ఎత్తుగడకు తెరతీసింది. విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసేవారికి పోలీసు భద్రత కల్పిస్తామని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల వ్యవహారాల్లో అవినీతిపై ఫిర్యాదు చేసేవారికి భద్రత కల్పిస్తామని ప్రకటించింది. భద్రతా అంశంపై నిర్ణయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌కు కట్టబెట్టింది. ఈమేరకు అదనపు డీజీ(ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్హాను నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణ పరిధిలోని వస్తారు. సీఎంకు కళ్లు, చెవులుగా వ్యవహరించడమే ఆయన బాధ్యత. అంటే సీఎం ఎవరికి చెబితే వారికి పోలీసు భద్రత కల్పిస్తారన్నది సుస్పష్టం. ఆ ముసుగులో రాష్ట్రంలోని టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ప్రైవేటు వ్యక్తులకు పోలీసు భద్రత కల్పించేందుకు ఎత్తుగడ వేశారు. ప్రజాధనం వెచ్చిస్తూ తమ అస్మదీయులకు పోలీసు భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాదు... ఆ ముసుగులో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సంఘ విద్రోహ శక్తులకు కూడా పోలీసు భద్రత కల్పించేందుకు ప్రణాళిక రచించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కార్యాలయాల తరలింపు పిటిషన్లపై హైకోర్టు సీరియస్
-
కార్యాలయాల తరలింపు పిటిషన్లపై హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి : ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏపీ ముఖ్యమంత్రి, అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరు కామెంట్లు చేశారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి పిటిషనర్లకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. వ్యక్తులను ఉద్దేశించి కోర్టుల్లో పిటిషన్లు ఎలా వేస్తారని..ఇలాంటి అభ్యర్థనలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఎలా అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇటువంటి అంశాల మీద హైకోర్టు ఎందుకు నోటీసులిస్తుందని... అనుబంధ పిటిషన్‌లోని అంశాలకు, కోర్టుకు ఏమిటి సంబంధమని హైకోర్టు సీరియస్ అయింది. కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై తదుపరి విచారణను 17కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా సీఎంకు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వ్యక్తులను ఉద్దేశించి దాఖలు చేసిన అంశాలపై విచారణకు కోర్టులు లేవని మండిపడింది. ఇలాంటి అభ్యర్థనలు పిల్ కిందకు రావని, సీఎంకు, అధికారులకు నోటీసులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నోటీసులు ఇస్తే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దుర్వినియోగం చేసినట్టే అని హైకోర్టు పేర్కొంది. -
'పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్'
-
'పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్'
విజయవాడ: విశాఖ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్' అని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సమ్మిట్ పేరుతో రూ. 28 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సమ్మిట్ ద్వారా 361 ఎంవోయిలు, రూ. 4 లక్షల 76 వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని టీడీపీ సర్కార్ చెప్పిందన్నారు. ఆర్టీఐ కింద సమాచారం సేకరిస్తే ఇంతవరకు ఏపీకి, ఒక పరిశ్రమ, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని అన్నారు. ప్రభుత్వం తమ అవినీతిని బయటపెడుతుందనే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోందని విమర్శించారు. ప్రజాదుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. -
విజిలెన్స్ కమిషన్‌ను విభజించండి
ఏపీ, టీ రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషనర్ లేఖ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెండు వేర్వేరు విజిలెన్స్ కమిషన్లను ఏర్పాటు చేయాలని పేర్కొంటూ ఏపీ విజిలెన్స్ కమిషనర్ ఎస్వీ ప్రసాద్ ఆయూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలోని కమిషనే యథాతథంగా కొనసాగుతోంది. దీంతో కమిషనరే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల వేర్వేరుగా లేఖలను పంపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రాష్ట్రానికి ప్రత్యేక విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా విజిలెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం ఉన్న ఉమ్మడి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ అవశేషాంధ్ర ప్రదేశ్ కమిషన్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఏపీ కొత్తగా విజిలెన్స్ కమిషన్ కోసం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉండదు.ఉమ్మడి రాష్ట్ర కమిషన్‌లో ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువమంది తెలంగాణ వారే . తెలంగాణ ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటుచేసి తమ ఉద్యోగులను యథాతథంగా తీసుకుంటుందా? కొత్త వారిని నియమించుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది.