
‘జవహర్ నీ కులాన్ని తిడితే నీకు కోపం రావడం లేదేమో.. నాకు వస్తోంది’ అని ఏపీ ఎక్సైజ్‌శాఖ మంద్రి కేఎస్ జవహర్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
సాక్షి, పశ్చిమగోదావరి : కొయ్యలగూడెం బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆడపడుచులు, మహిళలు, పోలీసులు, 85 ఏళ్ల వృద్ధులను కొడుతూ, కులం పేరుతో దూషించే నాయకులకు ప్రజలను పాలించే అర్హత లేదన్నారు. ‘జవహర్ నీ కులాన్ని తిడితే నీకు కోపం రావడం లేదేమో.. నాకు వస్తోంది’ అని ఏపీ ఎక్సైజ్‌శాఖ మంద్రి కేఎస్ జవహర్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు దళితులపై ఆనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. (చింతమనేని అనుచరుల హల్‌చల్)
భయపడి ఎన్నికలు పెట్టడం లేదు...
‘కొయ్యలగూడెంలో ఒక్క డిగ్రీ కాలేజీ కుడా లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే జనసేన గ్రామాల్లో పాతుకు పోతుందనే భయం చంద్రబాబును పట్టుకుంది. నేను ముఖ్యమంత్రి అవటానికి రాలేదు. పోరాటం చేయడానికి వచ్చా’ అని పవన్ చెప్పారు. ప్రాజెక్టుల కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు రాళ్ల భూములు, నీటి సౌకర్యం లేని భూములు, నాణ్యత లేని గృహాలు అంటగడుతున్నారని పవన్ ధ్వజమెత్తారు.