
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు సీన్ కట్ అయ్యింది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నాయకులను పొత్తుల పేరుతో, సర్వేల పేరుతో వారి టికెట్లు గల్లంతు చేసి టీడీపీ వదిలించుకుంది. జిల్లాలో ఏకంగా ఐదుగురు సీనియర్లకు మొండిచేయి చూపి డబ్బు సంచులకే ప్రాధాన్యం ఇస్తూ ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతిలో టికెట్లు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దళిత మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పీతల సుజాత, టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు వేటుకూరి శివరామరాజు, బండారు మాధవనాయుడుకు టీడీపీ జాబితాలో సీటు గల్లంతు కాగా పార్టీ పెద్దలు నామమాత్రంగా అయినా పట్టించుకోని దుస్థితి.
పక్కన పెట్టేశారు
జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారు. సామాజిక, ఆర్థిక ప్రాబల్యం ఉండి నియోజకవర్గంలో పనిచేస్తున్నా లోకేష్‌తో సత్సంబంధాలు గొప్పగా లేవని, సంతృప్తిస్థాయి లేదనే కారణాలతో టికెట్లు గల్లంతు చేశారు. అది కూడా సామాజిక సమీకరణాలు పట్టించుకోకుండా ఎస్సీల్లో ఒకే సామాజిక వర్గానికి అన్ని సీట్లు ఇవ్వటం, పొత్తుల పేరుతో టీడీపీ కాపు సీట్లన్నీ పూర్తిగా వదిలించుకోవడం, బీసీలకు ఒక్క సీటు మాత్రమే కేటాయించడంపై జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజకీయం రగులుతుంది. డబ్బే ప్రామా ణికం అంటూ అడ్డగోలుగా టికెట్లు కేటాయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్ర అసంతృప్తితో..
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పార్టీ కనీసం స్పందించలేదు. శివరామరాజు అనుచరులతో సమావేశాలు నిర్వహించి టీడీపీకి గుడ్‌బై చెబుతానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నరసాపురం నుంచి 2014 ఎమ్మెల్యేగా గెలుపొందిన బండారు మాధవనాయుడు అక్కడ క్రియాశీలకంగా పనిచేసి టికెట్ ఆశించి పొత్తుల పేరుతో భంగపడ్డారు. కనీసం పార్టీ నుంచి పిలుపు లేకపోగా అధినేత అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించి భంగపడటంతో రాజీనామా దిశగా యోచన చేస్తున్నారు. అలాగే టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పొత్తులతో టికెట్ పొగొట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడు కావడంతో పార్టీ పెద్దలు ఒకటికి రెండు సార్లు బుజ్జిగించటంతో మౌనంగా ఉన్నారు.
పెత్తందారులదే టీడీపీలో పెత్తనం అంటూ..
రెండు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీ సొంత సామాజిక వర్గం నేతల చేతిలో అణచివేత, వేధింపులకు గురైనా.. పార్టీ వీడకుండా ఉన్న మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్ జవహర్‌కు చంద్రబాబు మొండిచేయి చూపారు. 2014లో జవహర్ కొవ్వూరు నుంచి, పీతల సుజాత చింతలపూడి నుంచి గెలుపొంది మంత్రులుగా పనిచేశారు. అయినా ఆయా నియోజకవర్గాల్లో బాబు సొంత సామాజికవర్గ నేతల చేతిలో రాజకీయంగా బలికావడంతోపాటు 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లలో కనీసం ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా కూడా వేయించుకోలేని దుస్థితి వారిద్దరిదీ. సా మాజిక కోణంలో అయినా కచ్చితంగా అవకాశం వస్తుందని రెండు జాబితాల వచ్చే వరకు వేచి చూసి భంగపడిన వారు తీవ్ర అసంతృప్తితో మాట్లాడారు. పెత్తందారులదే టీడీపీలో పెత్తనమని, దళితులను పట్టించుకోవడం లేదంటూ ఘాటుగా మాట్లాడటంతో జిల్లాలో చర్చగా మారింది.

వేటుకూరి శివరామరాజు, ఉండి మాజీ ఎమ్మెల్యే

గన్ని వీరాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు



Comments
Please login to add a commentAdd a comment