నరసాపురం సీటుపై రగడ
జనసేన సీటు తనకే ఇచ్చారంటున్న నాయకర్
పార్టీ నుంచి సమాచారం లేదంటున్న మాజీ మంత్రి కొత్తపల్లి
ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ తిరుగుబావుటా
టీడీపీ రెబల్‌గా బరిలో దిగేందుకు ప్రయత్నాలు
తణుకులో మౌనం వీడని విడివాడ
భీమవరంలో అంతుపట్టని అంజిబాబు వైఖరి
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండన్న ధోరణిలో సీట్ల కేటాయింపులు చేశారని కేడర్ మండిపడుతుంది. అధినాయకత్వాల తీరు పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉండిలో రెబల్‌గా బరిలో దిగేందుకు కలవపూడి శివ సిద్ధమవుతుండగా.. భీమవరంలో జనసేన అభ్యర్థితో ఆ పార్టీ నేతలే అంటీముంటనట్లుగా ఉన్నారు. నరసాపురంలో సీటుపై రగడతో కేడర్ అయోమయంలో పడిపోయింది. తణుకులో విడివాడ వర్గం టీడీపీకి సహకరించేందుకు ఇష్టపడడం లేదు.
నాయకర్ వర్సెస్ కొత్తపల్లి
జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు పొత్తులో భాగంగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాలు జనసేన, తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ తమ అభ్యర్థులను బరిలో దింపింది. ఇటీవల విజయవాడలో పవన్‌కళ్యాణ్‌ను కలిసిన జనసేన నాయకుడు బొమ్మిడి నాయకర్ నరసాపురం సీటు తనకే ఇచ్చారంటూ ప్రకటించుకోవడంతో పాటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రజాగళం సభకు సంఘీభావ ర్యాలీ సందర్భంగా నాయకర్‌కు సీటు కేటాయింపుపై తనకు సమాచారం ఏమీ లేదని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జనసేనలో చేరిన సుబ్బారాయుడు సీటు తనదేనంటూ ప్రచారం చేసుకున్నారు.
అటు నాయకర్, ఇటు కొత్తపల్లి ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. తాజాగా సుబ్బారాయుడు వ్యాఖ్యల నేపథ్యంలో నరసాపురం సీటు పంచాయితీ కొలిక్కివచ్చినట్టు లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు టీడీపీలోను వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వర్గం, ప్రస్తుతం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న పొత్తూరి రామరాజు వర్గం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రామరాజు ఇన్‌చార్జి బాధ్యతలను మరికొద్ది రోజుల్లో పీకేస్తారంటూ బండారు వర్గం ప్రచారం చేస్తుండగా బండారుకు పార్టీలో స్థానమే ఉండదంటూ రామరాజు వర్గం చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితమైన టీడీపీ తాజా పరిణామాలతో మరింత దిగజారుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా విడివాడ వర్గం
వారాహి యాత్ర సందర్భంగా పవన్‌కళ్యాణ్ ఇచ్చిన హామీతో తణుకు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావుకు అధినేత నిర్ణయం మింగుడు పడటం లేదు. తణుకు సీటు టీడీపీకి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విడివాడ వర్గం అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండిపోయింది. తాడేపల్లిగూడెం జెండా సభ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చిన సందర్భంగా విడివాడ అనుచరుల నిరసన నేపథ్యంలో న్యాయం చేస్తామని మాటిచ్చిన నాదెండ్ల మనోహర్ తర్వాత కనీసం పలకరించింది లేదు.
ఉండి బరిలో కలవపూడి శివ
ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) తిరుగుబావుటా ఎగురవేయడంతో కూటమి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది. టిక్కెట్ కేటాయింపుపై చంద్రబాబు తనను సంప్రదించకపోవడం ఎంతో వేదనకు గురిచేసిందన్న ఆయన ఉండి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. ఆ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనకున్న పరిచయాలతో కేడర్‌ను సమాయత్తం చేసుకుంటూ టీడీపీ రెబల్‌గా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ కేవలం 21 సీట్లుకే పరిమితం కావడం పట్ల జనసేన కేడర్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. మిత్రపక్షం కేడర్ కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకులే ఇక్కడ ఆ పార్టీ జెండాలు వెంటేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంజిబాబుపై అసంతృప్తి
భీమవరంలో గత ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇటీవల జనసేన సీటు తెచ్చుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) కేడర్‌ను దగ్గరకు చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అంజిబాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండగా గత పది రోజులుగా జనసేనను దగ్గరకు చేసుకునే ప్రయత్నాల కంటే పాత పరిచయాలున్న టీడీపీ కేడర్ పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారంటూ జనసేనలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంజిబాబు ప్రవర్తన చూస్తుంటే టీడీపీ అభ్యర్థా, లేక జనసేన అభ్యర్థా అనే సందేహం వ్యక్తమవుతోందని జనసేన కేడర్ వాపోతోంది. దీంతో అంజిబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment