ఉండిలో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నాయకుల వద్ద విచారంగా కూర్చున్న ఎమ్మెల్యే రామరాజు
తేలని పంచాయితీ
అమలాపురంలో ఎమ్మెల్యే రామరాజు, టీడీపీ కేడర్‌తో చంద్రబాబు భేటీ
సీటుపై ఇంకా ఇవ్వని స్పష్టత
రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడి
అభ్యర్థి మార్పునకు సంకేతమని మండిపడుతున్న శ్రేణులు
ఉండిలో 3వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు
సాక్షి, భీమవరం/ ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కూటమి సీటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాలకొల్లు, అమలాపురంలలో ఇప్పటికే రెండు సార్లు కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో, టీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంపై కేడర్ మండిపడుతున్నారు. ఉండి అభ్యర్థిగా ఎమ్మెల్యే రామరాజును మొదటి జాబితాలోనే చంద్రబాబు ప్రకటించగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజుకు ఎంపీ సీటు దక్కకపోవడంతో అతని కోసం రామరాజు సీటుకు ఎసరు పెట్టారు.
ఈ క్రమంలో ఉండి సీటు మారుతున్నట్టు వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. పాలకొల్లు ప్రజాగళం పర్యటనలో ఎమ్మెల్యే రామరాజు, టీడీపీ నేతలు చంద్రబాబును కలిసి స్పష్టత ఇవ్వాలని కోరినా ఆయన స్పందించలేదు. దీంతో సీటు మారిస్తే రఘురామకృష్ణరాజును చిత్తుగా ఓడిస్తామంటూ చంద్రబాబు ఎదుటే టీడీపీ నేతలు నిరసన తెలిపారు. తమను కాదని అభ్యర్థిని మారిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు సంతకాల సేకరణ చేశారు. పలువురు నిరాహార దీక్షలు చేపట్టారు. భీమవరంలోని టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించి పార్టీ శ్రేణులు ఆందోళన సైతం నిర్వహించారు.
అమలాపురంలోనూ అదే తీరు
ఉండి సీటు విషయమై వారం రోజులుగా నెలకొన్న నిరసనల నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజును, నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలను చంద్రబాబు శుక్రవారం అమలాపురం పిలిపించుకుని మాట్లాడారు. చర్చలు జరుగుతున్నాయని, రెండు రోజుల్లో ప్రకటిస్తానని వారిని వెనక్కి పంపేశారు. రామరాజుకే సీటని స్పష్టత ఇస్తారనుకుంటే ఇంకా నాన్చుడు ధోరణిలో ఉండటం సీటు మార్పునకు సంకేతమని టీడీపీ నాయకులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీటని చెప్పి మొదటి జాబితాలోనే రామరాజు పేరును ప్రకటించి ఇప్పుడు మరొకరి పేరు తెరపైకి తేవడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
గత ఎన్నికల్లో పార్టీ కార్యాలయం ముందు సైకిల్ గుర్తును తగలబెట్టిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. ఇంతకాలం నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసిన తమకు అన్యాయం చేస్తూ మరొకరిని పోటీలో దింపితే చూస్తూ ఊరుకోబోమని, తగిన శాస్తి చేస్తామని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. తాజా పరిణామాలపై ఎమ్మెల్యే రామరాజు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
మూడో రోజుకు చేరిన నిరాహార దీక్షలు
ఎమ్మెల్యే రామరాజుకు మద్దతుగా ఉండిలోని టీడీపీ మండల కార్యాలయం వద్ద పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చెన్నంశెట్టి హరినాయుడు, పాలకోడేరు ఏరియా కన్వీనర్ కాలా గణేష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరింది. ఉదయం హరినాయుడు, గణేష్‌లకు సైలెన్లు ఎక్కించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మధ్యాహ్నం ఎమ్మెల్యే రామరాజు శిబిరం వద్దకు చేరుకున్నారు. గణేష్‌ను వైద్య సాయం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment