సాక్షి ప్రతినిధి,ఏలూరు: తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ప్రకంపనలు ఉమ్మడి పశ్చిమగోదావరిలో కాకరేపాయి. ఏళ్ల తరబడి నుంచి టికెట్ ఆశిస్తూ పనిచేస్తున్న ముఖ్య నేతలందరికీ బలంగా హ్యాండ్ ఇచ్చారు. విచిత్రమేమిటంటే ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుల సీట్లు కూడా నూరుశాతం గల్లంతవ్వడం విశేషం. అధికారికంగా జనసేన, టీడీపీ సీట్లు ప్రకటించకపోయినా చంద్రబాబు జనసేనకు కేటాయించిన స్థానాల టీడీపీ ఇన్‌చార్జులకు ఫోన్ చేసి జనసేన పార్టీకి పనిచేయండని చెప్పడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయలు అసమ్మతి సభ నిర్వహించగా.. శనివారం పోలవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో అసమ్మతి సెగల నడుమ సమావేశాలు వాడీవేడిగా సాగాయి.
వరుస పెట్టి ఫోన్లు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వరుస పెట్టి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జులకు ఫోన్లు చేస్తున్నారు. గత రెండు రోజుల్లో పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జులకు ఫోన్లు చేసి ‘సారీ’ చెప్పగా అంతకు ముందే భీమవరం, నరసాపురం ఇన్‌చార్జులకు పరోక్ష సంకేతాలిచ్చి సీట్లు తమవి కాదని తేల్చారు. దీంతో పాటు నరసాపురంలో పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, కొత్తపల్లి సుబ్బారాయుడుల్లో ఎవరైతే బాగుంటుందని సర్వే కూడా మొదలుపెట్టేశారు. అలాగే భీమవరం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయి జనసేన నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించేసుకున్నారు. పార్టీలో చేరకుండానే జనసేన కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. ఈ తాజా పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో టీడీపీలో గందరగోళం రేగింది.
భగ్గుమంటున్న తమ్ముళ్లు
నామమాత్రపు బలం లేని జనసేనకు ఏలూరు, నరసాపురం పార్లమెంట్ స్థానాల పరిధిలో ఐదు అసెంబ్లీ సీట్లు ఇవ్వడమేంటని, వారి స్థాయి ఎంత, ఓటింగ్ ఎంత, ఆర్థిక బలం లేని వాళ్లను ఎందుకు నెత్తిన పెట్టుకోవాలంటూ టీడీపీ కేడర్ భగ్గుమంటోంది. రెండు రోజులు క్రితం ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులకు ఎటువంటి సమాచారం లేకుండా సీటు గల్లంతు చేశారు. ఎల్లో మీడియా కథనాలు చూసి పార్టీ ముఖ్యులతో సీటు గల్లంతైన విషయాన్ని ధ్రువీకరించుకుని వీరాంజనేయులు హడావుడిగా భీమడోలులో సమావేశం నిర్వహించి తమ సత్తా పార్టీకి తెలియజేయాలని, భారీగా కార్ల ర్యాలీ నిర్వహించి ఉంగుటూరు సీటు జనసేనకు ఇవ్వవద్దని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు నుంచి ఫోన్ రావడంతో గన్ని ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.
సీటు లేదు సారీ అంటూ..
సీటు లేదు సారీ అంటూ వరుస ఫోన్లు టీడీపీ ఇన్‌చార్జులకు వస్తున్నాయి. అధికారికంగా పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జులకు రాగా నరసాపురం, భీమవరం ఇన్‌చార్జులకు స్పష్టమైన సంకేతాలు ఇంతకు ముందే ఇచ్చారు. శనివారం తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జి నియోజకవర్గ సమావేశం నిర్వహించి పొత్తులపై ముందే చెబితే బాగుంటుంది, కోట్లు ఖర్చుపెట్టి హడావుడి చేసిన తర్వాత పొత్తు పేరు చెప్పి సీటు గల్లంతు చేయడం సరికాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారని ప్రకటించుకున్నారు. ఇక పోలవరానికి సంబంధించి ఎలాంటి హామీ లేకుండా సీటు జనసేనదేనని తేల్చిచెప్పారు. మొత్తం మీద పొత్తు స్థానాలు జనసేన ప్రకటించకుండానే చంద్రబాబు లీక్స్‌తో టీడీపీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గ టికెట్‌ను తెలుగుదేశం పార్టీకే కేటాయించాలని కోరుతూ ఆదివారం నియోజకవర్గ ముఖ్య నాయకులు చంద్రబాబును కలవనున్నారు. ఈ సీటును జనసేనకు కేటాయించవద్దని చంద్రబాబు దృష్టికి బలంగా తీసుకువెళ్లనున్నారు.
అత్యవసర సమావేశాలు
తాజాగా పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జిలకు కూడా చంద్రబాబు నుంచి ఫోన్లు వచ్చాయి. అందరికీ ఫోన్ చేసి ‘ఎవరూ పార్టీని తిట్టవద్దు.. నన్ను విమర్శించవద్దు.. పొత్తు ధర్మాన్ని పాటించి జనసేనకు పనిచేయండి’ అని చంద్రబాబు చెప్పడంతో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. పార్టీ గీత దాటవద్దంటూనే ఇన్‌చార్జులు పార్టీ నియోజకవర్గ అత్యవసర సమావేశాలు నిర్వహించి వాళ్లు మాట్లాడకుండా కేడర్‌తో పార్టీని తిట్టించటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment