
కాలనీల్లో ప్రజల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కాలనీలు, టిడ్కో గృహాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్ అన్నారు. బుధవారం సీపీఎం ప్రతినిధి బృందంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ జిల్లాస్థాయి ప్రజా చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించగా అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వాటిలో తక్షణం పరిష్కారయుతంగా ఉన్న మౌలిక సమస్యలైన దారి లేని కాలనీలు, టిడ్కో ఇళ్ల శ్లాబ్ లీకేజీలు, అసంపూర్తి నిర్మాణాలు వంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వాసుదేవరావు, కౌరు పెద్దిరాజు తదితరులున్నారు.
ఇళ్ల స్థలాల కోసం ధర్నా
భీమవరం: పేదల ఇళ్లస్థలాలకు సంబంధించి ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ తక్షణం నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, డీఆర్‌ఓకు ఆర్జీలు సమర్పించారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తొమ్మిది నెలలు గడిచిపోయినా హామీలను అమలు చేయలేదన్నారు. సత్వరమే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్‌ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తమరాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్
భీమవరం: భీమవరంలో బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని డీఎన్నార్ కళాశాలలో ఉదయం షిప్ట్‌లో 100 మందికి 93 మంది, మధ్యాహ్నం షిప్ట్‌లో 100 మందికి 95 మంది హాజరయ్యారని పరీక్షల పర్యవేక్షకుడు సూర్యనారాయణమూర్తి చెప్పారు.
ప్రసూతి మరణాలు నివారించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రసూతి మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా గీతాబాయి ఆదేశించారు. జిల్లాలో ప్రసూతి మరణాలపై బుధవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయి సిబ్బందికి తగు సూచనలు చేశారు.
ఉపాధి హామీలో ‘పశ్చిమ’ ముందంజ
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులను చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. రెట్టింపు పని దినాల కల్పనతో జిల్లా ముందంజలో ఉందన్నారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల పని దినాలు లక్ష్యం కాగా 37.71 లక్షల పని దినాలు కల్పించి 96.69 శాతానికి పైగా లక్ష్యం సాధించినట్లు చెప్పారు . ఉపాధి హామీ పథకం నిధులతో మొత్తం 33 వేల పనులు చేపట్టగా, 25 వేల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 40 లక్షల పని దినాల లక్ష్యసాధనతో పాటు మూగ జీవాలకు 140 నీటి తొట్టెల నిర్మానానికి సుమారు రూ.50 లక్షల వ్యయంతో అంచనాలు తయారు చేసి ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నామని చెప్పారు. 20 వేల కిలోమీటర్ల పొడవైన పూడికతీత పనులు, 200 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం పనులు, పశుగ్రాస పెంపకం పనులు, తాగునీటి సాగునీటి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు.

కాలనీల్లో ప్రజల సమస్యలు పరిష్కరించాలి