
ఫిర్యాదులపై అలసత్వం సహించం
జేసీ రాహుల్ కుమార్ రెడ్డి
భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్‌ఎస్ పిటిషన్లు పరిష్కారంపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. గత రెండు నెలల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు అనిపిస్తుందని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్‌కి వెళ్లి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తగు సూచనలు తెలియజేసి సమస్యలు వేగవంతంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని శాఖల్లో ఫిర్యాదులు ఎక్కువ పెండింగ్ ఉన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ.. తిరిగి మళ్లీ ఫిర్యాదు చేయకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ డా. కెసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష
పాలకోడేరు: రబీ సీజన్ ధాన్యం కొనుగోలులో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం రబీ సీజన్‌కు సంబంధించి పాలకోడేరు మండలం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు నిమిత్తం అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలులో రెండు విషయాలపై సిబ్బందికి దిశ నిర్దేశం చేసి సూచనలు చేశారు. మండలంలోని వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు సిబ్బందితో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ధాన్యం కొనుగోలులో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రైస్ మిల్లర్ నుంచి సరఫరా చేసే గోనె సంచులను ముందుగా పరిశీలించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ ఎన్.బి.విజయలక్ష్మి, ఎంఏఓ వి.రమణరావు తదితరులు పాల్గొన్నారు.