తిరువూరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు
కొవ్వూరులో ఆయన అనుచరుల గగ్గోలు
కొవ్వూరు: మాజీ మంత్రి కేఎస్ జవహర్ యూటర్న్ తీసుకున్నారు. కొవ్వూరు టిక్కెట్ ఇవ్వకపోవడంతో తిరువూరులోనైనా అవకాశం ఇవ్వాలంటూ అధినేతను వేడుకొంటున్నారు. టీడీపీ కొవ్వూరు టిక్కెట్ ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడంపై ఆయన షాకయ్యారు. తాను నియోజకవర్గం నుంచే పోటీలో ఉంటానని రెండు రోజుల క్రితం శపథం చేశారు. అది నిజమేననుకుని ఆయన వర్గీయులందరూ భ్రమ పడ్డారు. అయితే జవహర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తిరువూరుపై ఆయన కన్నెశారు.
దీని భాగంగా ఆయన స్వగ్రామమైన గానుగపాడు పయనమయ్యారు. అక్కడే మకాం వేసి ఆదివారం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నాయకులతో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో ఐదేళ్లుగా కొవ్వూరులో ఆయన వర్గీయులుగా ముద్ర వేసుకున్న నాయకుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధిష్టానం కొవ్వూరు టిక్కెట్‌ను ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడంపై జవహర్ వర్గం తీవ్రస్థాయిలో మండిపడింది.
శుక్రవారం కూడా జవహర్ విలేకరుల సమావేశం నిర్వహించి, తాను కొవ్వూరు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటానని వెల్లడించారు. ఇప్పుడు జవహర్ యూటర్న్ తీసుకోవడంతో ఆయన వర్గీయులకు ఏమి చేయాలో తెలియడం లేదు. ముప్పిడికి టిక్కెట్ ఇవ్వడాన్ని విభేదించిన తాము.. మళ్లీ ఆయన చెంతకు ఎలా వెళ్లతామంటూ తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల నుంచి జవహర్ కోసం ఎన్నోసార్లు తగవులు పడ్డాం, ఇప్పుడు టీడీపీలో వ్యతిరేక వర్గంతో కలిసి ఎలా పనిచేయగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జవహర్ మాత్రం మరోసారి తిరువూరు నుంచి అవకాశం ఇవ్వాలంటూ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment