మంత్రి జవహర్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు | TDP Leaders Internal Conflicts In West Godavari | Sakshi
Sakshi News home page

దేశంలో ఆక్రోశం

Published Sat, Feb 16 2019 2:02 PM | Last Updated on Sat, Feb 16 2019 2:07 PM

TDP Leaders Internal Conflicts In West Godavari - Sakshi

మంత్రి జవహర్‌కు టిక్కెట్టు కేటాయించవద్దంటూ ధర్నా చేపట్టిన వ్యతిరేక వర్గం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అధికార పార్టీలో వేడి మొదలైంది. అసమ్మతి నాయకులు రోడ్డెక్కుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వద్దంటూ ప్రదర్శనలు ర్యాలీలు చేస్తున్నారు. మరోవైపు   అసమ్మతి నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. తాజాగా నరసాపురం మండలం సీతారాంపురం నార్త్‌ ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న మాదాసు నరసింహారావు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తనకు ప్రాతినిధ్యం ఇవ్వక పోవడంతో 1982లో పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్న తనకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు కూడా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తుండటం కలకలం రేపుతోంది. 

ముప్పిడికి చుక్కెదురు
తాజాగా ద్వారకాతిరుమల మండలంలోని వేంపాడు గ్రామంలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. స్థానిక ఎస్సీ ఏరియాలో కొత్తగా నిర్మించిన మంచినీటి ట్యాంకు (ఓహెచ్‌ఎస్‌ఆర్‌)ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన్ను స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారో చూపాలని నిలదీశారు. ఇప్పుడు మోటారు లేని వాటర్‌ ట్యాంకును ప్రారంభించడం వల్ల తమకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు
కొవ్వూరులో మంత్రి జవహర్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు రెండోరోజు హోరెత్తాయి. మంత్రి కేఎస్‌ జవహర్, ఆయన ముఖ్య అనుచరుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిలకు వ్యతిరేకంగా పార్టీలోని ఒక వర్గం శుక్రవారం చేపట్టిన బైక్‌ ర్యాలీ అసమ్మతి మంటలు రేపింది. ఇప్పటికే మంత్రికి వ్యతిరేకంగా కొవ్వూరులో పార్టీ ముఖ్య నాయకులు యూవీఎస్‌ నారాయణ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సూరపనేని చిన్నిల ఆధ్వర్యంలో రెండో పార్టీ కార్యాలయం ప్రారంభించడం తెలిసిందే. వ్యతిరేక వర్గం మంత్రి జవహర్‌కు టిక్కెట్టు కేటాయించవద్దని, అవినీతి నాయకులు మాకొద్దు అంటూ  బైక్‌ ర్యాలీ చేపట్టడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో  మాల సామాజికవర్గాన్ని పూర్తిగా విస్మరించారని, ఆ సామాజిక వర్గం నేతలు రెండురోజులుగా నిరసన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. 

టీడీపీకి చెందిన  మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎలిపే ప్రభాకరరాజు, తాళ్లపూడి ఎంపీటీసీ సభ్యుడు పెదపాటి కృష్ణమోహన్, గజ్జరం తాజా మాజీ సర్పంచ్‌ శెట్టిమాలి భీమయ్యలతో పాటు పలువురు  ఆ పార్టీకి చెందిన మాల సామాజిక వర్గం నేతలు మంత్రి జవహర్‌ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గతంలో సొంత పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకోవడం నుంచి నిత్యం ఏదొక వివాదంతో మంత్రి తరచూ వార్తల కెక్కుతున్నారు. పార్టీ అధిష్టానానికి పలుమార్లు స్థానిక నాయకులు మంత్రిపై రాతపూర్వక ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో నెలకొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. 

మంద కృష్ణ మాదిగతో జవహర్‌ చర్చలు 
గతంలో ఎమ్మార్పీఎస్‌ సభకు వెళ్లకుండా అడ్డుకునే ప్రక్రియలో భాగంగా మంత్రి జవహర్‌ తన సామాజికవర్గానికి చెందిన 17 మంది కార్యకర్తలపై అప్పట్లో కేసు నమోదు చేయించారు. దీంతో అప్పటి నుంచి ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులు మంత్రికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకు  ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందా కృష్ణ మాదిగతో గురువారం  మంత్రి స్వగృహంలో అంతరంగికంగా చర్చలు చేసినట్లు తెలిసింది. 19న అమరావతిలో నిర్వహించే మాదిగల విశ్వరూప మహాసభ ఆహ్వానం పేరుతో గురువారం ఇద్దరూ రహస్యంగా భేటీ అయ్యి చర్చించినట్లు తెలిసింది. మరోవైపు మంత్రి అనుకూల వర్గం మాల సామాజిక వర్గం చేస్తున్న దీక్షకు వ్యతిరేకంగా పోటీగా కార్యక్రమం నిర్వహించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement