సాక్షి, అమరావతి: కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు. కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కింద మరో రూ. 5,631 చెల్లిస్తారు. అంటే మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లిస్తారు. నిర్ధారణ కేసులకు రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకూ కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు. తక్షణమే ఈ ఆదేశాలు పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆదేశించారు.
సామాన్యుల రక్షణకు సర్కార్ చర్యలు అభినందనీయం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా మహమ్మారి నుంచి సామాన్య ప్రజల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్– ఏపీ విభాగం పేర్కొంది. ఈ మేరకు వ్యవస్థాపక సభ్యుడు భూపతిరాజు రామకృష్ణంరాజు, కన్వీనర్లు బుద్దా చక్రధర్, ఇమాన్యుయల్, శ్రీనివాసగౌడ్, చలపతిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. అందులో ఏముందంటే..
► ఒక్క రోజులో 53 లక్షల మంది ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేయడం అద్భుతం.
► లాక్‌డౌన్ దృష్ట్యా గత నెల 29న రేషన్ పంపిణీ చేయడం వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు మేలు జరిగింది.
► ప్రభుత్వం చేపట్టిన విభిన్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల వల్ల అసంఘటిత, రోజువారీ వేతన కూలీలు, వ్యవసాయ కార్మికులు, సన్న, చిన్నకారు రైతులు, ఉపాధి కూలీలు, వృద్ధాప్య, వితంతు పెన్షనర్లు, గూడు లేని యాచకులతో పాటు అన్ని వర్గాల పేదలకు భరోసా లభించింది.
చదవండి: రెడ్ జోన్ల వారీగా పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment