కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే | Most Of The Coronavirus Cases In Four Districts Of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

66% కేసులు 4 జిల్లాల్లోనే

Published Fri, Apr 24 2020 3:35 AM | Last Updated on Fri, Apr 24 2020 10:24 AM

Most Of The Coronavirus Cases In Four Districts Of Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నాలుగు జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అదికూడా ఆ నాలుగు జిల్లాల్లోని అర్బన్‌ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో 893 కేసులు నమోదు కాగా, పైన పేర్కొన్న నాలుగు జిల్లాల్లోనే 590 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,034 టెస్టులు చేశారు. టెస్టులు, పాజిటివ్‌ కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇన్ఫెక్షన్‌ రేటు 1.85 శాతం మాత్రమే. డిశ్చార్జి అయ్యే పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఆ రెండు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు
► విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తూర్పుగోదావరి, విశాఖపట్నం వంటి జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్‌ నియంత్రణలోనే ఉంది. 
► కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 17,884 నమూనాలను పరీక్షించారు. ఇందులో 590 పాజిటివ్‌ కాగా, మిగతా 17,294 కేసులు నెగిటివ్‌గా తేలాయి.  
► రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఒక్క కర్నూలు జిల్లాలోనే 26.20 శాతం, గుంటూరు జిల్లాలో 21.83 శాతం కేసులు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 48.03 శాతం కేసులు నమోదయ్యాయి.

గ్రీన్‌ జోన్‌లో 573 మండలాలు : డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి చెందిన 181 క్లస్టర్లను గుర్తించామని, 573 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. 66 శాతం కేసులు కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని, అవి కూడా పట్టణాల్లోనే ఉన్నాయన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో 14 కేసులు మినహా.. ఇతరత్రా నమోదవుతున్న కేసులన్నీ రెడ్‌జోన్లలోనే ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. టెస్ట్‌లు చేయడంలో రాష్ట్రం.. దేశంలోనే మొదటి స్థానంలోకి వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
► రాష్ట్ర వ్యాప్తంగా 181 క్లస్టర్లు ఉన్నాయి. ఇందులో 121 పట్టణ ప్రాంతాల్లో, 60 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 573 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. 56 మండలాలు రెడ్‌జోన్‌లో, 47 ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. జిల్లాల వారీగా అయితే 590 కేసులు ఈ నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయి. 
► ‘గ్రీన్‌ జోన్‌లను కాపాడండి.. రెడ్‌జోన్‌లను నియంత్రించండి’ అనే నినాదంతో ముందుకెళుతున్నాం. దేశంలో 10 లక్షల జనాభాకు సగటున 334 టెస్ట్‌లు చేస్తుంటే మన రాష్ట్రంలో 961 టెస్టులు చేస్తున్నాం. 
► ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో ఒక్కొక్కరికి 3 మాస్స్‌లు ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 16 వేల పడకలకు 2.21 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాం. వెంటిలేటర్‌ కంటే ఆక్సిజన్‌ చికిత్సే మంచిదని ఐసీఎంఆర్‌ చెబుతోంది.
 
ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసుకోవచ్చని ఐసీఎంఆర్‌ ఆదేశాలు 
► ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసుకోవచ్చని ఐసీఎంఆర్‌ ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ మొదలుపెట్టాం. ఫిబ్రవరి 25 నాటికి రాష్ట్రంలో ఒకే ఒక్క ల్యాబొరేటరీలో 90 టెస్టుల సామర్థ్యం ఉండేది. ఇప్పుడు ల్యాబొరేటరీల సంఖ్య 9కి పెంచి రోజుకు 3,480 టెస్టులు చేసే స్థాయికి చేరుకున్నాం.
► ఎక్కడ టెస్టులు చేసినా వైరాలజీ ల్యాబొరేటరీలో చేసేదే ఫైనల్‌. అయితే ఎక్కువ మందికి ప్రాథమిక స్క్రీనింగ్‌ చేసేందుకు ర్యాపిడ్‌ టెస్టులు ఉపయోగపడతాయి. ఔట్‌ పేషెంట్‌ సేవలకు ఇబ్బంది లేకుండా 14410 నంబర్‌ ద్వారా టెలి మెడిసిన్‌ ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ 306 మంది డాక్టర్లు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చారు. 4 వేల మందికి పైగా ఈ పద్ధతిలో వైద్య సేవలు పొందారు.  

బులెటిన్‌లోని అంశాలే రాయండి
► రాష్ట్రంలో 3 లక్షల పీపీఈ కిట్లు, 1.40 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రతి పనీ పారదర్శకంగా చేస్తోంది. మేము విడుదల చేసే బులెటిన్‌లోని అంశాలే రాయండి. ఇదే అధికారికంగా భావించండి. 
► ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు ఇక టెస్ట్‌లు దాస్తున్నారనడంలో నిజం లేదు.

గ్రీన్‌జోన్‌లో 84.7 % మండలాలు
రాష్ట్రంలో 573 మండలాలు  గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి.
56 రెడ్‌ జోన్‌లో, 47 ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి.

వాస్తవాలు మాట్లాడండి
కరోనాతో మృతులకు సంబంధించి ఆడిట్‌ చేస్తున్నాం. క్రిటికల్‌ కేర్‌ నిపుణులను ఏర్పాటు చేశాం. టెస్టులు దాస్తే దాగేవి కావు. చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వాస్తవాలు మాట్లాడండి. వేలాది మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మీరు వారిని ప్రోత్సహించకపోయినా ఫరవాలేదు.. దయచేసి విమర్శించకండి. – డా.కె.ఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement