కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసం పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల నుంచి తమ పింఛను డబ్బులు ముట్టినట్టు సంతకాలు తీసుకుంటారు. నిరక్షరాస్యులైతే, వారికి పింఛను డబ్బులు పంపిణీ చేసినట్టు ఒక ఫొటో తీసి, వలంటీరు వద్ద మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
సాధారణ పరిస్థితుల్లో పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా బయోమెట్రిక్ విధానంతో వేలి ముద్రలను సరిపోల్చుకొని డబ్బులు చెల్లించడం గత కొంత కాలంగా కొనసాగుతోంది. అయితే ఒకే బయోమెట్రిక్ మెషీన్ ద్వారా వరుసగా పలువురు లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలను సేకరించడం వల్ల కోవిడ్ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందనే అనుమానంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా నేరుగా పింఛను డబ్బుల పంపిణీకి ఆమోదం తెలిపింది.
రేషన్ సరుకులకు ఈ–పాస్ నుంచి మినహాయింపు
ఏప్రిల్ నెలకు సంబంధించి రేషన్ కార్డులపై ఇచ్చే సబ్సిడీ సరుకుల పంపిణీలో ఈ–పాస్ యంత్రాలను వినియోగించకూడదని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రేషన్ డీలర్లు లబ్ధిదారుల వివరాలను పాత విధానం ప్రకారం రికార్డు పుస్తకంలో నమోదు చేసి సరుకులు ఇవ్వనున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈ–పాస్ యంత్రాల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
రేషన్ సరుకుల కోసం వచ్చే లబ్ధిదారులు ఈ–పాస్ మెషిన్‌లో ఒకరి తర్వాత మరొకరు వేలిముద్రలు వేయడం వల్ల కరోనా వైరస్ విస్తరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. ఏప్రిల్ నెల సరుకులను దేశమంతటా మాన్యువల్ పద్ధతిలోనే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించి పూర్వ పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు కోన శశిధర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment