సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఉపాధికి దూరమైన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సరుకుల 13వ విడత పంపిణీ గురువారం ముగుస్తుంది. ఏప్రిల్ కోటా నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో పేదలకు 13 సార్లు బియ్యంతో పాటు కందిపప్పుగానీ, శనగలుగానీ ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బియ్యం కార్డులోని ప్రతి సభ్యుడికి ఐదు కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు ఉచితంగా అందుతున్నాయి. బియ్యం కార్డు లేని అర్హులు దరఖాస్తు చేసుకుంటే విచారించి వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో బియ్యం కార్డుల సంఖ్య 1.47 కోట్ల నుంచి 1.51 కోట్లకు చేరింది.
రద్దుచేసిన కార్డుదారులకు మరో అవకాశం
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అనో, ఐటీ చెల్లిస్తున్నారనో, ఇతరత్రా కారణాలతోనో రద్దుచేసిన కార్డుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఉదాహరణకు ఆరుగురు కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ కుటుంబ రేషన్ కార్డును అనర్హమైనదని గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగి లేదా ఐటీ చెల్లిస్తున్న వ్యక్తికి పెళ్లి అయివుంటే భార్య పేరును తొలుత కార్డులో నమోదు చేయించాలి. తర్వాత కార్డు నుంచి వారిద్దరి పేర్లను తొలగించడానికి దరఖాస్తు చేసుకుంటే మిగిలిన కుటుంబసభ్యుల పేరిట కొత్తగా బియ్యం కార్డు మంజూరు చేస్తారు. ఇలా వివిధ కారణాలతో రద్దయిన కార్డులను పునరుద్ధరించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment