ఏపీ: 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు | Corona tests beyond 10 lakh in AP | Sakshi
Sakshi News home page

మిలియన్‌ మార్క్‌

Published Mon, Jul 6 2020 3:51 AM | Last Updated on Mon, Jul 6 2020 7:46 AM

Corona tests beyond 10 lakh in AP - Sakshi

మొదటి లక్ష టెస్టులకు 59 రోజుల సమయం పడితే 10వ లక్ష టెస్టులు చేయడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది.  చివరి మూడు లక్షల టెస్టులు కేవలం 12 రోజుల్లో పూర్తి చేశారు. ఒక్కసారి ఈ వివరాలు పరిశీలిస్తే... ఆదివారం ఉదయం నాటికి నిర్వహించిన టెస్టుల సంఖ్య ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనాను కట్టడి చేయాలంటే వ్యక్తిగత శుభ్రతతోపాటు ఎక్కువ టెస్టులు నిర్వహించడం,పాజిటివ్‌ బాధితులను కంటైన్మెంట్‌ చేయడమే అత్యుత్తమ మార్గం. ఈ రెండు వ్యూహాలను విజయవంతంగా అమలు చేయడంతో ఏపీ పేరు అంతటా మారుమోగుతోంది. ఎక్కడ చూసినా ఏపీ మోడల్‌నే అనుసరించాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్రభావం మొదలయ్యే నాటికి రాష్ట్రంలో టెస్టింగ్‌కు సంబంధించిన వనరులే లేకున్నా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టింది. 

దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 10.17 లక్షల పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 1.05 లక్షల పరీక్షలు జరిగాయి. సరిగ్గా 4 నెలల క్రితం రాష్ట్రంలో ఒక్క టెస్టు కూడా చేయలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా రోజూ 34 వేలకు పైగా పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ సాధించడం గమనార్హం. చాలా దేశాల సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో టెస్టులు జరుగుతుండటం ప్రభుత్వ ముందుచూపు, జాగ్రత్త చర్యలను రుజువు చేస్తున్నాయి. అధికార యంత్రాంగం, వైద్య సిబ్బంది కృషి కారణంగా కరోనా నియంత్రణలో ఏపీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచింది.     
– సాక్షి, అమరావతి

రోజుకు సగటున 34,525 టెస్టులు 
► రాష్ట్రంలో ప్రస్తుతం 14 వైరాలజీ ల్యాబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవికాకుండా 47 ట్రూనాట్‌ మెషీన్లు, సీబీనాట్, నాకో ల్యాబొరేటరీలు, క్లియా మెషీన్ల ద్వారా కూడా టెస్టులు చేస్తున్నారు. 
► మొత్తం 78 ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. 
► 47 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా రోజుకు 8,125 టెస్టులు చేయవచ్చు. 
► 5 సీబీనాట్, 2 నాకో, 5 సీఎల్‌ఐఏ ల్యాబొరేటరీల్లో కూడా పరీక్షలు చేస్తున్నారు 
► ఏపీలో మొత్తం అన్ని ల్యాబ్‌ల్లో కలిపి రోజుకు సగటున 34,525 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉంది.  

పది లక్షల టెస్టులు 3 రాష్ట్రాల్లోనే
► దేశంలో ఇప్పటివరకూ 10 లక్షల కరోనా టెస్టులు నిర్వహించింది కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే కావడం గమనార్హం. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ఇందులో ఉన్నాయి.  
► తమిళనాడులో 13.06 లక్షలు, మహారాష్ట్రలో 10.85 లక్షల టెస్టులు నిర్వహించారు. 
► ఏపీలో ఇప్పటిదాకా 10.17 లక్షల టెస్టులు చేశారు. 
► మిగతా రెండు రాష్ట్రాలు 10 లక్షల టెస్టులు నిర్వహించినా అవి రెండూ ఏపీ కంటే జనాభాలో పెద్ద రాష్ట్రాలు కావడం గమనార్హం. పైగా దేశంలో ఎక్కువ సంఖ్యలో కేసులు ఆ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.  
► తమిళనాడులో పాజిటివిటీ రేటు 8.19 శాతం, మహారాష్ట్రంలో 18.44 శాతం ఉండగా ఏపీలో కేవలం 1.84 శాతం మాత్రమే ఉంది. 

ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు తొలి నమూనా 
కరోనా మొదలైన ఆరంభంలో మన రాష్ట్రంలో వైరాలజీ ల్యాబొరేటరీ లేకపోవడంతో ఫిబ్రవరి 1న తొలి నమూనాను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. మార్చి 6వతేదీ వరకు రాష్ట్రంలో ల్యాబొరేటరీలు లేవు. మార్చి 7న తిరుపతిలో మొదటిసారి వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా 14 ల్యాబ్‌లను ప్రారంభించారు. 

ఏ టెస్టు ఎలా చేస్తారంటే?
రాష్ట్రంలో 5 రకాల పద్ధతుల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఏ ల్యాబ్‌లో ఎలా నిర్ధారణ చేస్తున్నారన్నది పరిశీలిస్తే... వైరాలజీ ల్యాబొరేటరీల్లో దీన్నే ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ మెథడ్‌ అంటారు. గొంతులో లేదా ముక్కులో నుంచి ద్రవాన్ని సేకరించి పరీక్షిస్తారు. దీన్ని రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ అంటారు. వైరస్‌ నిర్ధారణలో ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ పద్ధతిగా నమోదైంది.  

ట్రూనాట్‌.. సీబీనాట్‌.. నాకో ల్యాబొరేటరీల్లో
ఈ మూడు ల్యాబొరేటరీల్లో గొంతులోంచి గానీ ముక్కులో నుంచి గానీ ద్రవాలను తీసి పరీక్ష చేస్తారు. వాస్తవానికి ట్రూనాట్‌ మెషీన్లను క్షయ నిర్ధారణకు ఉపయోగించేవారు. వీటిని కరోనా పరీక్షలకూ వాడుకోవచ్చని ఐసీఎంఆర్‌ అనుమతించింది. చిప్‌ సాయంతో ఫలితాలొస్తాయి. వీటి ఫలితాల కచ్చితత్వం 50 శాతమే ఉంటుంది. అందుకే ట్రూనాట్, సీబీనాట్, నాకో ల్యాబుల్లో పాజిటివ్‌ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్‌కు పంపిస్తారు. 

క్లియా మెషీన్లలో 
పైన పేర్కొన్న ల్యాబ్‌ల్లో ద్రవాలను తీసి పరీక్షిస్తే ఇక్కడ రక్త నమూనాలను తీసి నిర్ధారిస్తారు. ఇందులో కూడా కచ్చితత్వం 50 శాతమే. ఇక్కడ పాజిటివ్‌ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు పంపిస్తారు. 

14 వైరాలజీ ల్యాబ్‌లు..  
ఏపీలో మార్చి 6కి  ముందు ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. ఇప్పుడా సంఖ్య 14కు పెరిగింది. జిల్లాకొకటి చొప్పున 12 జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో 2 చొప్పున మొత్తం 14 వైరాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మంగళగిరి ఎయిమ్స్‌ ల్యాబ్‌తో కలిపితే వీటి సంఖ్య 15కు చేరుతుంది. ఇక ప్రైవేట్‌లో 4 ల్యాబ్‌లున్నాయి. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసే ఈ ల్యాబ్‌లు ఎప్పుడొచ్చాయి? రోజుకు ఎన్ని చేస్తున్నారో పరిశీలిస్తే... 

నోట్‌ : పూలింగ్‌ పద్ధతిలో ఒకేసారి ఎక్కువ పరీక్షలు జరిపే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సాధారణ కెపాసిటీలో 10 టెస్టులు చేయొచ్చనుకుంటే.. ఆ పది టెస్టులు నెగిటివ్‌ వస్తే సమయం వృధా అయినట్టే. అదే పూలింగ్‌ విధానంలో అయితే ఒకేసారి 50 టెస్టులను మిషన్లో పరీక్షించి పాజిటివ్‌ వస్తే తిరిగి నిర్ధారణ చేస్తారు. అదే 50 నమూనాలు నెగటివ్‌ అని తేలితే సమయం వృధా కాకుండా ఒకేసారి 50 మందికి టెస్టులు నిర్వహించినట్టవుతుంది.

సీఎం ఆదేశాలతో ల్యాబ్‌లు పెంచాం
రాష్ట్రంలో టెస్టులు పెంచి పాజిటివ్‌ బాధితులను కంటైన్మెంట్‌ చేయడం వల్లే కరోనాను మెరుగ్గా నియంత్రించగలిగాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైరాలజీ ల్యాబొరేటరీల సంఖ్య పెంచాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దస్థాయిలో ల్యాబొరేటరీలు పెంచలేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా నియంత్రణలో ఉంది.    
    – డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ     

పీహెచ్‌సీల్లోనూ నమూనాల సేకరణ
రాష్ట్రంలో వైరాలజీ ల్యాబొరేటరీలు పెంచడం వల్లే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టెస్టులు చేయగలుగుతున్నాం. అన్ని పీహెచ్‌సీలకూ కిట్‌లు పంపించాం. స్థాయిని బట్టి పీహెచ్‌సీల్లో నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. ఈ విధానం వల్లే ఎక్కువ టెస్టులు చేయగలిగాం.    
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement