
తిరుమల: తిరుమలలో గత నెలలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ నెల 16 నుంచి 24 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండటంతో దర్శనం టికెట్ల సంఖ్య పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన శ్రీవారి ఆలయంలోని పలు ప్రాంతాలను, నూతనంగా నిర్మిస్తున్న పరకామణి భవనం పనులను పరిశీలించారు.