
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇప్పటివరకూ కోవిడ్–19 (కరోనా వైరస్) కేసులు నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌పై శనివారం ఆయన బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు 32 మంది (కొత్తగా శుక్రవారం రాత్రి మూడు, శనివారం ఐదు కేసులు) రక్త, కళ్లె నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. వాటిలో 23 మందికి నెగిటివ్ (కోవిడ్ వైరస్ లేదు) అని తేలినట్లు స్పష్టం చేశారు. మిగిలిన 9 మంది నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ్
కోవిడ్–19ను నిరోధించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని కుటుంబ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ వి.విజయరామరాజు హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంబులెన్స్‌ల నిర్వహణ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆరా తీశారు. శాంపిల్స్ తీసుకున్న వెంటనే రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. శాంపిల్స్ తీసుకున్న పేషెంట్‌ను వదిలేస్తే చర్యలు తప్పవన్నారు. శాంపిల్స్‌లో నెగిటివ్ వచ్చినా అశ్రద్ధ చేయవద్దని, డిశ్చార్జ్ ప్రొటోకాల్‌ను పాటించాలన్నారు. ఐసొలేషన్ వార్డులు ఓపీకి దూరంగా ప్రత్యేక బ్లాకుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో హెల్త్ డైరెక్టర్ అరుణకుమారి, డీఎంఈ వెంకటేష్ పాల్గొన్నారు.