ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించడం మా కల: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Covid Control | Sakshi
Sakshi News home page

కోవిడ్ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష

Published Mon, Aug 2 2021 12:13 PM | Last Updated on Mon, Aug 2 2021 4:07 PM

CM YS Jagan Review Meeting On Covid Control - Sakshi

సాక్షి, అమరావతి: 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం కోవిడ్‌ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పెళ్లిళ్ల సీజన్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్‌ విస్తరణకు దారితీసే అవకాశాలున్నాయి. శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలి. పెళ్లిల్లో 150 మంది మాత్రమే ఉండాలి. కోవిడ్‌ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయాలని, ఆ పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయని గుర్తుచేశారు. ఇంటింటీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని, 104 నంబర్‌ యంత్రాంగం సమర్థంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలని సూచించారు.

విలేజ్‌ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానం చేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ల్యాబులను కూడా అనుసంధానం చేయాలి. గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్‌ జరగాలి. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్‌ క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలి.

ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్‌ ద్వారా ఈ వివరాలన్నీకూడా వెంటనే తెలిసేలా చూడాలి. ఇదివరకే సేకరించిన డేటా వివరాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానం చేయాలి. నిర్దేశిత సమయంలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుడు ఆగ్రామానికి వెళ్తున్నప్పుడు చికిత్సకు ఈ వివరాలు ఎంతో సహాయపడతాయి. సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యం అందించడానికి దోహదపడుతుంది. డిసెంబర్‌ వరకు విలేజ్‌క్లినిక్స్‌ అన్నింటినీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.

ఆస్పత్రుల్లో నాడు - నేడుకు సంబంధించి పనులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 వైద్య కళాశాలల్లో పనుల ప్రగతిని ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు - నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సీఎం సూచించారు. నిధులపరంగా ఒక కార్యాచరణ ప్రకారం ముందుకురావాలని చెప్పారు.

ఒక మంచి ఉద్దేశంతో 16 వైద్య కళాశాలల నిర్మాణాలను చేపట్టామని సీఎం జగన్‌ గుర్తుచేశారు. కళాశాలల్లో సరైన యాజమాన్య విధానాలపై ఎస్‌ఓపీలను రూపొందించాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈ తరాలకే కాదు, భవిష్యత్‌ తరాలకు కూడా అత్యుత్తమ వైద్యం ప్రజలకు అందాలన్నదే మా కల. ప్రభుత్వ ఉద్యోగి కూడా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపికచేసుకునేలా వాటిని తీర్చిదిద్దాలి. ఎల్లప్పుడూ కూడా ఈ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రులు కొత్తగా కనిపించాలి. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందాలి. కార్పొరేట్‌ఆస్పత్రులకు దీటుగా వీటిని నిర్వహించాలి. అందుకు తగ్గ ఎస్‌ఓపీలను తయారు చేయండి. ఎలా నిర్వహిస్తామో పద్ధతులను తయారు చేసి నాకు సమర్పించండి’’ అని అధికారులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement