ప్లాస్మా దాతలకు రూ.5వేలు: సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Review Meeting About Coronavirus Preventives | Sakshi
Sakshi News home page

తప్పుడు వార్తాలను ఖండించి నిజాలను ప్రజల ముందు పెట్టాలి

Published Fri, Jul 31 2020 2:15 PM | Last Updated on Fri, Jul 31 2020 3:22 PM

CM YS Jagan Mohan Reddy Review Meeting About Coronavirus Preventives - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. అలాగే సంబంధిత ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్డు పెట్టి.. అక్కడి బెడ్ల ఖాళీ, భర్తీ వివరాలను అందులో రాయాలని ఆదేశించారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేకపోతే.. వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్‌ అలాట్‌ చేయాలని తెలిపారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు.  హెల్ప్‌డెస్క్‌ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కోవిడ్‌ కోసం నిర్దేశించిన138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్‌డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలి. హెల్ప్‌డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే.. చాలావరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్‌ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి’ అన్నారు.

‘జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి. సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలి. జేసీలు దీనిపై ఫోకస్‌ పెట్టాలి. ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌పై బాగా దృష్టి పెట్టండి. కాల్‌సెంటర్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా.. చూడండి. వచ్చే కొన్ని రోజులు దీనిపై శ్రద్ధ వహించండి. కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టండి. స్వప్రయోజనాలకోసం తప్పుడు వార్తాకథనాలు ఇస్తే ఎప్పటికప్పుడు ఖండించాలి. లేదంటే ప్రజలు వీటిని వాస్తవం అనుకునే అవకాశం ఉంది. నిజాలు ప్రజలముందు పెట్టండి. వచ్చే సమాచారంలో వాస్తవాలు ఉంటే.. వాటిని పాజిటివ్‌గా తీసుకుని సమస్యలను పరిష్కరించండి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి. ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలి. ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది’ అన్నారు సీఎం జగన్‌. (ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్‌)

‘సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి. దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండి. వీటిని ఎలా వాడాలన్న దానిపై వారికి అవగాహన కల్పించాలి. కోవిడ్‌ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే... ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలి. నాడు-నేడు కార్యక్రమాలనూ సమీక్షించాలి. మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తికావాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement