![Covid-19: India Administers Record 1 Crore Vaccine Doses On August 27 - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/28/vaccccai.jpg.webp?itok=Ei2XcKw0)
న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు కోటి డోసులకు పైగా వ్యాక్సినేషన్లు జరిగినట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటి వరకూ ఒకరోజు వ్యవధిలో చేసిన అత్యధిక వ్యాక్సినేషన్ల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 62,17,06,882కు చేరుకుంది. కోవిన్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్క రోజులోనే 1,00,64,032 డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. కోటి డోసులు దాటడం గుర్తుండిపోదగ్గ సందర్భమని ప్రధాని మోదీ అన్నారు.
వ్యాక్సినేషన్లు తీసుకొని డ్రైవ్‌ను విజయవంతం చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఈ నెల 17న ఒకే రోజు 88 లక్షల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకూ ఒకరోజులో జరిగిన అత్యధిక వ్యాక్సినేషన్ల రికార్డు అదే కాగా, తాజా రికార్డు దాన్ని బద్దలుకొట్టింది. 18–44 వయసుల వారిలో 30,85,06,160 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోగా, 23,98,99,849 మంది రెండు డోసులను తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment