
తిరుపతి సెంట్రల్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఒకరు ఓ భక్తుడికి మెయిల్ ద్వారా అశ్లీల వీడియో లింక్‌లను పంపిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పాలక మండలి సదరు సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి దీనిపై తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించడంతో సైబర్ క్రైం పోలీసు బృందం రంగంలోకి దిగింది.
శతమానం భవతి వివరాలు కోరగా..
ఎస్వీబీసీ ప్రసారం చేసే శతమానం భవతి కార్యక్రమం ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభ సందర్భాల్లో పురోహితులు ఆశీర్వచనాలు అందిస్తారు. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఈ కార్యక్రమం వివరాలు పంపాలని కోరగా ఎస్వీబీసీ కార్యాలయం సిబ్బంది ఒకరు అశ్లీల వీడియో లింక్ పంపినట్లు గుర్తించారు. మెయిల్ తెరిచి చూసి నిర్ఘాంతపోయిన భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేయడంతో తక్షణమే విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ తిరుపతి అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి సుమారు 82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించింది. టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు క్షుణ్నంగా విచారణ కొనసాగుతోంది.
కంప్యూటర్ల సెక్యూరిటీ ఆడిట్..
అశ్లీల వీడియోను మెయిల్ చేసిన అటెండర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎస్వీబీసీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో భాగంగా ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ ఆడిట్ చేసినట్లు చెప్పారు. ముగ్గురు నలుగురు సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సైబర్ సెల్ టీం విచారణలో ప్రాథమికంగా తేలిందని, పూర్తి వివరాలు పరిశీలించాక విధుల నుంచి తప్పించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇక టీటీడీ పర్యవేక్షణలో..
ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ విభాగాన్ని టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు సీఈవో ప్రకటించారు. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్‌కు పాస్‌వర్డ్ ఏర్పాటు చేసి ఎవరు వినియోగిస్తున్నారో నమోదు చేస్తామన్నారు. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోకి తెస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment