రూ.కోట్లలో దోచేస్తున్న ఎమ్మెల్యే వాసు
రాజమహేంద్రవరం సిటీ: పేకాట క్లబ్బులు, ఇసుక దందాలతో రోజుకి రూ.లక్షలు వెనకేసుకుంటూ వస్తున్న రాజమహేంద్రవరం సిటీ ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తాజాగా కోట్లాది రూపాయల భూ వ్యవహారాల్లో కూడా తలదూరుస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ఈవీఎం ఎమ్మెల్యే దందాల గురించి చెబుతూనే ఉన్నామన్నారు. తాను బురదలో ఉంటూ, ఎదుటివారిపై బురద జల్లడం ఆయనకు అలవాటేనని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఇంతవరకూ ఏ ఎమ్మెల్యేకు లేని అప్రతిష్ట మూటగట్టుకున్న ఘనత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకే దక్కుతుందన్నారు. గౌతమీ సూపర్ బజార్‌కి చెందిన దేవీచౌక్‌లోని 300 గజాల స్థలం లీజు విషయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తనకు 5కోట్ల రూపాయల లంచం ఇచ్చారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసి, కరపత్రాలు సైతం ముద్రించి తనపై బురద చల్లారన్నారు. తాము అధికారంలోకి వస్తే, అక్రమ లీజు రద్దుచేసి, అవినీతికి పాల్పడిన వారిని జైలుకి పంపుతానని శపథం కూడా చేశారని అన్నారు. తీరా ఎమ్మెల్యే అయ్యాక అదే స్థలంలో అదే లీజుదారుడు నిర్మాణాలు చేస్తుంటే, ఏం చేస్తున్నారని భరత్‌రామ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు చెప్పినట్లు ఈ లీజు వ్యవహారంపై వాస్తవం ఏమిటో తేల్చాలని భరత్‌రామ్ సవాల్ చేశారు. లేని పక్షంలో తాము కూడా ధర్నాకు దిగుతామని, వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. నగరంలో పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించి దేవదాయశాఖ అధీనంలో ఉన్న జేఎన్ రోడ్డులోని కోట్లాది రూపాయల విలువైన సుమారు నాలుగెకరాల భూమిని వైఎస్సార్ సీపీ హయాంలో కొందరు అన్యాయంగా తక్కువ రేటుకి కొట్టేయాలనుకుంటే, తాను అడ్డుకున్నానని తెలిపారు. ఇప్పుడు అదే స్థలాన్ని తక్కువ ధరకు కొట్టేయాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇందుకు ఈవీఎం ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్నారు.
మద్యం షాపుల్లో పెట్టుబడులు
ఎమ్మెల్యేలు గెలిచి మంచి పేరు తెచ్చుకున్నారని, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మీద లేని భూ దందా ఆరోపణలు ఈ ఎమ్మెల్యేపై ఉన్నాయన్నారు. మద్యం షాపుల్లో సైతం ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టి, వాటిని అనుచరులతో నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం నగరంలో ఎవరిని అడిగినా తెలుస్తుందన్నారు. ఆయన తండ్రి అదిరెడ్డి అప్పారావు గతంలో వైఎస్సార్ సీపీలో ఉండడం వలన తమ పార్టీలో కొందరితో సంబంధాలు కొనసాగిస్తూ, వాళ్లను కూడా కలుపుకుని మద్యం సిండకేట్ ఎమ్మెల్యే నడుపుతున్నారని జనం నుంచి వినిపిస్తోందన్నారు. మద్యం షాపులను బార్లుగా మార్చేస్తున్నారని, ఇక బెల్టు షాపులైతే విచ్చలవిడిగా తెరిచేస్తున్నారని భరత్‌రామ్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక విధంగా ఎన్నికలయ్యాక మరోవిధంగా ఉన్న ఎమ్మెల్యే వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తీరు మారకపోతే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మద్యం, ఇసుక, భూ దందాల్లో
ఆరితేరిపోయారు
మాజీ ఎంపీ భరత్‌రామ్
Comments
Please login to add a commentAdd a comment