తమ్ముళ్ల కళ్లలో వత్తులు!
తూర్పులో ఇలా..
జిల్లాలో ఇలా...
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు 6, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌లతో పాటు ఇతర స్టేట్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీ ఏర్పడి నెలలు గడుస్తున్నాయి. అన్ని సామాజిక వర్గాల నుంచి నేతలు పదవులు ఆశిస్తున్నారు. పదవుల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు అధిష్టానానికి పంపారు. వాటిని ఫిల్టర్ చేసి ప్రకటించేందుకు అధిష్టానం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో కార్యకర్తలు, నాయకులు సహనం కోల్పోతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో ప్రకటన, రోజుకో మాట చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరించడం.. కొన్ని పేర్లు ప్రకటించడం పరిపాటిగా మారుతోంది. రెండు దశల పోస్టుల భర్తీలో ఇదే విధానం అవలంబించారు. తాజాగా నెలాఖరుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహుల్లో మళ్లీ సందడి మొదలైంది. మార్కెట్ యార్డులు, దేవస్థానాల బోర్డుల్లోని నియామకాల కోసం పేర్లు ప్రతిపాదించాలని స్పష్టం చేయడంతో నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీలో కష్టపడిన, నిజమైన కార్యకర్తలకు పదవులు వరిస్తాయంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. రెండు విడతల భర్తీల్లోనూ పార్టీ కోసం శ్రమించిన పార్టీ శ్రేణులకు అన్యాయం జరిగింది. ఈ సారైనా తమకు న్యాయం జరుగుతుందా..? లేదంటే ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికే అందలం ఎక్కిస్తారా? అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది.
ఆశావహుల చక్కర్లు
ప్రధానంగా దేవస్థాన కమిటీలు, మార్కెట్ యార్డుల కమిటీలు, జిల్లా గ్రంథాలయాలు, నియోజకవర్గాల్లో పలు శాఖల్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల పందేరం సైతం పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. జిల్లా స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేట్ పదవులు, మండల, గ్రామ స్థాయి నేతలకు దేవస్థాన, మార్కెట్ యార్డు కమిటీలతో పాటు ఇతర కమిటీల్లో స్థానం కల్పించాలని సీఎం వద్దకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. పదవుల ప్రస్తావన మళ్లీ తెరపైకి రావడంతో ఆశావహులు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అభ్యర్థుల కోసం సీఎం వద్ద పైరవీలు చేసినట్లు తెలిసింది. అమరావతిలోనే తిష్ట వేసి మరీ తమ ప్రతిపాదనలు వినిపించేందుకు ఉత్సాహం చూపారు. అయితే చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
చినబాబు కనుసన్నల్లో ఎంపిక?
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేసినా.. చినబాబు ఆమోద ముద్ర వేయందే పదవులు దక్కడం లేదు. మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే జాబితా రూపొందిస్తున్నారు. గత రెండు విడతల్లో సైతం లోకేశ్ అనుయాయులకే పదవులు దక్కాయన్న వాదన వినిపిస్తోంది. పైకి మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు ఇస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు.. ఆచరణలోకి వచ్చేసారికి చినబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ప్రామాణికంగా పెట్టుకున్నట్లు సమాచారం. రెండు విడతల్లో సైతం సీనియర్లను పక్కనబెట్టి లోకేశ్ చెప్పిన వారికే పదవులు దక్కడంతో సీనియర్లలో అసంతృప్తి నెలకొంది. పార్టీ కోసం శ్రమిస్తున్నా.. తమకు సరైన గౌరవం దక్కడం లేదని లోలోన మదనపడుతున్నారు. పైకి చెప్పుకున్నా.. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో చేసేది లేక మిన్నకుండిపోతున్నారు.
జనసేన, బీజేపీ నేతలకు నిరాశే?
మూడో దశ నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన, బీజేపీ నేతలకు మొండిచెయ్యి చూపనున్నట్లు తెలిసింది. టీడీపీలోనే నామినేటెడ్ ఆశావహుల సంఖ్య పెరిగిపోతుండటంతో బీజేపీ, జనసేనకు ఇస్తే కొత్త తలనొప్పి ఎదురవుతుందని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే తమ కృషితో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. మందు, ఇసుక వ్యాపారాలు అన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారని, కనీసం నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయకపోతే ఎలాగన్న ప్రశ్న ఎదురవుతోంది.
ఎమ్మెల్సీపై ఆశలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ భర్తీ కోసం నగారా మోగింది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడనున్నాయి. 29వ తేదీతో పదవీ కాలం యుగియనుంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువుగా నిర్ధారించారు. మార్చి 20న పోలింగ్ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలపై జిల్లాలోని ప్రధాన నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారైనా తమకు దక్కుతాయా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు ఆశావహులకు రెండో విడతలోనూ చుక్కెదురైంది. మూడో దశలోనైనా వరిస్తుందన్న ఆశతో ఉన్నారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావుకు రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో నిరాశ తప్పలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా శేషారావు నిడదవోలు ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారు. ఆయన స్థానంలో జనసేన నేత కందుల దుర్గేష్‌కు కేటాయించారు. శేషారావుకు సముచిత స్థానం కల్పిస్తామని, ఎమ్మెల్సీ, ఇతర ప్రాధాన్యత పదవుల్లో నియమిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి, రెండో దశలోనూ నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ ఎప్పుడిస్తారన్న విషయమై స్పష్టత కరవైంది. బాబు వ్యవహార శైలిని పరిశీలిస్తే శేషారావు కేవలం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి స్థానానికే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మూడో దశ నామినేటెడ్ పోస్టుల పందేరం మొదలవ్వడం, 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండంతో ఈసారైనా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశగా వేచిచూస్తున్నారు.
టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడికే పార్టీలో ప్రాధాన్యం కరవైంది. కొవ్వూరు నియోజకవర్గంలో తమ సామాజిక వర్గం నేతలకు అధికారం కట్టబెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు అన్యాయం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్.జవహర్‌కు రెండు విడతల నామినేటెడ్ జాబితాల్లోనూ స్థానం దక్కలేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వరిస్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆ పదవి ఇతరులకు కేటాయించడంలో ఇక నామినేటెడ్ కలగానే మిగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా ఘోరంగా అవమానించిన టీడీపీ తాజాగా నామినేటెడ్‌లో పక్కన పెట్టేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడికే దిక్కులేకపోతే సామాన్య కార్యకర్తలకు ఏం న్యాయం జరుగుతుందన్న ప్రశ్న కార్యకర్తల్లో ఉత్పన్నమవుతోంది. ద్విసభ్య కమిటీ సభ్యుల అభ్యంతరం మేరకు జవహర్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న వాదన నియోజకవర్గ టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తాజాగా నామినేటెడ్ పదవుల పందేరం నడుస్తుండటం, ఎమ్మెల్సీలు ఖాళీలు ఏర్పడటంతో ఈ దశలోనైనా సీనియర్ నేతకు స్థానం దక్కుతుందా..? లేదా..? అన్న మీమాంస పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం చంద్రబాబు
అనుభవానికి
పెద్దపీట వేస్తామని ప్రకటన
ఇప్పటికే రెండు జాబితాల్లో
సీనియర్లకు దక్కని చోటు
తాజా ప్రకటనతో
ఆశావహుల్లో సందడి
ఎమ్మెల్యే, మంత్రులకు
అపాయింట్‌మెంట్ ఇవ్వని బాబు
ప్రకటిస్తాం వెళ్లండంటూ జవాబు
లోకేష్ డైరెక్షన్‌లో
రూపొందుతున్న జాబితా
తమ్ముళ్ల కళ్లలో వత్తులు!
Comments
Please login to add a commentAdd a comment