గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలను నిషేధించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరిలోకి డ్రెడ్జింగ్ పడవలు రాకుండా ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ళ రాజు, ప్రగతి శీల కార్మిక సమాఖ్య (పీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కే మస్తాన్ ఆధ్వర్యంలో బొమ్మూరులో కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికులతో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గతంలో పడవలలో కార్మికులు ఇసుక తీసి గట్టుకు తరలించేవారని, ఈ మధ్యకాలంలో కొంతమంది దళారులు ఎటువంటి అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ పడవలతో గోదావరిలో యంత్రాలతో ఇసుక తీస్తున్నారని, దీని వలన పదివేల మంది ఇసుక తీసే కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలతో ఇసుక తీయడం వల్ల గోదావరిలో 340 అడుగు లోతు గోతులు ఏర్పడుతున్నాయని, భవిష్యత్తులో గోదావరిలో నిర్మించిన కట్టడాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. చట్ట వ్యతిరేకంగా యంత్రాలతో ఇసుక తరలిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు నిషేధించాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు, కృష్ణ, సత్తిబాబు, దుర్గ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment