డాక్టర్ చిర్రావూరి అస్తమయం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మహామహోపాధ్యాయ, శ్రీ రామాయణ తత్త్వజ్ఞ డాక్టర్ చిర్రావూరి శ్రీ రామశర్మ కర్నాటక రాష్ట్రం శృంగేరిలో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. 1948లో రాజమహేంద్రవరంలో జన్మించిన చిర్రావూరి సీతంపేటలోని గౌతమీ విద్యాపీఠంలో విద్యార్థులకు సంస్కృత, ఆంధ్రాలు బోధించేవారు. తెలుగు సంస్కృత భాషలలో అష్టావధానాలు, షోడశ అవధానాలు నిర్వహించారు. కంచి, శృంగేరి, దత్త పీఠం ఆధ్వర్యంలో సత్కారాలు అందుకున్నారు. అవిభక్త రాష్ట్రంలో ఆగమ శాస్త్ర సలహా మండలి సలహాదారునిగా సేవలు అందించారు. 2023లో అనారోగ్య కారణంగా శృంగేరిలో ఉన్న కుమారుని వద్దకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, శలాక రఘునాథశర్మ, కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి, భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు, కలాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి తదితరులు చిర్రావూరి మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికపై
న్యాయ పోరాటం
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీదారు జీవీ సుందర్
రాజమహేంద్రవరం సిటీ: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఓటమి పాలైనప్పటికీ యువత, ఉపాధ్యాయ, ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తూనే ఉంటానని జీవీ సుందర్ వెల్లడించారు. బుధవారం స్థానిక రాజీవ్‌గాంధీ కళాశాలలోని సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందన్నారు. బల్క్‌గా ఓట్లు చేర్పించడం దగ్గర నుంచి ఓటర్లను ప్రలోభపెట్టడం, చివరికి కౌంటింగ్‌లో కూడా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల అవకతవకలపై న్యాయపోరాటం చేస్తానన్నారు. కౌంటింగ్‌లో ఎవరో సెట్ చేసినట్లుగా కూటమి అభ్యర్థికి ప్రతీ రౌండ్‌కు 16వేల పైచిలుకు ఓట్లు వచ్చాయన్నారు. కనీసం ఓటు వేయడం రాని వారిని కూడా ఓటర్లుగా చేర్చారని, ఓట్ల లెక్కింపులో అనేక బ్యాలెట్‌లపై జై టీడీపీ అంటూ రాయడం కన్పించిందన్నారు. ఇప్పటికే గ్రూప్ 2 విద్యార్థుల తరఫున న్యాయస్థానంలో కేసు వేసి పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం ప్రజలు ఇచ్చిన విజయం కాదని, చంద్రబాబు ఇచ్చిన విజయమని ఆరోపించారు.
11న పీడిఎస్ బియ్యం వేలం
గోపాలపురం: తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన 47 274 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్(ప్రజాపంపిణీ బియ్యం)తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో గల ఎం ఎల్ ఎస్ పాయింట్‌లో ఈ నెల 11వ తేదీ 10గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6ఎ కేసులు ముగియడంతో సీజ్ చేసిన 47 274 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కిలో ఒక్కంటికీ రూ.30 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యాపారస్తులు జీఎస్టీ లైసెన్స్ కలిగి ముందుగా రూ.2 లక్షల ధరావత్తు సొమ్మును జాయింట్ కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా వారి పేరున డీడీ రూపంలో చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.
తాళం వేసిన దుకాణంలో చోరీ
అమలాపురం టౌన్: స్థానిక నారాయణపేటలో శ్రీహరి ఆటో మొబైల్స్ పేరిట నిర్వహిస్తున్న మోటారు సైకిల్ మెకానిక్ షాపులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. మూడు పోర్షన్లు ఉన్న పెంటిల్లు అది. ఆ ఇంట్లో షాపుగా ఉన్న పోర్షన్‌కు తాళం వేసి ఉండగానే చోరీ జరిగి నగదు మాయం కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాపు యాజమాని దనలకోట కృష్ణ షాపులో ఓ సంచిలో రూ.10 లక్షల వరకూ దాచుకున్నానని, అవి చోరీకి గురయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్సై తిరుమలరావు, క్రైమ్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం చోరీ జరిగిన తీరును పరిశీలించారు. తాను రెండేళ్ల కిందట స్థలం విక్రయించిన సొమ్ము, తాను రోజు సంపాందించే సొమ్మును షాపులో ఓ సంచిలో దాచుకుంటున్నానని యజమాని తెలిపాడు. ఈ డబ్బు కుమారుడి వివాహానికి కూడబెట్టానని పోలీసులకు వివరించాడు. నారాయణపేటలోనే ఉన్న తన సొంత ఇంట్లో నగదు దాచుకోకుండా షాపులో ఉండచంపై, షాపు తాళం తీయకుండానే సొమ్ము పోవడంపై కృష్ణను పలు కోణాల్లో విచారిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ఇంటి మూడు పోర్షన్లలో ఒకటి అద్దెకు ఇవ్వగా, మరొకదానిలో కృష్ణ సోదరుడు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం షాపునకు తాళం వేసి వెళ్లిన కృష్ణ బుధవారం ఉదయం వచ్చి షాపు తాళం తీసి లోనికి వెళ్లినప్పుడు చోరీ జరిగినట్లు గమనించాడు.
Comments
Please login to add a commentAdd a comment