సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీతో పొత్తు తమ పార్టీని చిత్తు చేసిందనే జనసేన శ్రేణుల ఆవేదన కాస్తా.. అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆగ్రహంగా మారింది. ఆయనతో పాటు జనసేన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. నిన్నమొన్నటి వరకూ పవన్‌ను నెత్తిన పెట్టుకున్న నేతలు, అభిమానులే ఇప్పుడు ఆయనను దుమ్మెత్తిపోస్తున్నారు. జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలు అని పవన్ ప్రకటించడంతో పవర్ స్టార్ కాస్తా ఒక్కసారిగా ‘పవర్‌లెస్’ స్టార్ అని నిరూపణ అయిపోయిందని దుయ్యబడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా పవన్ తీరుపై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి.
► టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కట్టబెట్టిన జగ్గంపేట సీటును ఆశించి, అక్కడి జనసేన ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్రరావు భంగపడ్డారు. పవన్ నిర్ణయంపై ఆగ్రహంతో గోకవరం మండలం అచ్యుతాపురం కనకదుర్గ ఆలయంలో శనివారం అర్ధరాత్రి నుంచి సతీసమేతంగా తనువు చాలిస్తానంటూ ‘అంతిమ ఆమరణ దీక్ష’ చేపట్టారు. సామాన్యులైన తనవంటి వారు రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యేలు అవ్వాలనుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
►పెద్దాపురం సీటును మూడోసారి కూడా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ఇవ్వడంపై ఆ పార్టీ ఇన్‌చార్జి తుమ్మల రామస్వామి సహా పలువురు మండిపడుతున్నారు. పెద్దాపురం మండలం పులిమేరులో సమావేశమైన ఆ పార్టీ నేతలు పవన్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు. జనసేన జిల్లా కార్యదర్శి పదవికి పిట్టా జానకీరామారావు రాజీనామా చేసి, పవన్ వైఖరిని ఖండించారు.
► కొత్తపేటలో జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్‌కు సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ ఆలమూరులోని జనసేన కార్యాలయం వద్ద నేతలు పార్టీ ఫ్లెక్సీలను దహనం చేశారు.
► ముమ్మిడివరంలో టిక్కెట్టు ఆశించి భంగపడిన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పితాని బాలకృష్ణ వర్గీయులు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment