
కుంటుబడ్డ ఇంటి ప్రణాళికలు
ఒక్క ప్లాన్ కూడా అమలు కాలేదు
జీవో నంబర్ 20 వచ్చినప్పటి నుంచి అమలాపురం మున్పిపాలిటీలో 300 మీటర్ల లోపు ఇంటి స్థలాల్లో ప్లాన్ అప్రూవల్ అవ్వలేదు. 300 మీటర్లు దాటిన స్థలాల్లో పెద్ద భవనాలు, కమర్షియల్ భవనాలకు అనుమతులు ఇచ్చాం.
– రాణి సంయుక్త,
టౌన్ ప్లానింగ్ అధికారి, అమలాపురం
జీవో నంబర్ 20ని సవరించాలి
మా ఎల్‌టీపీల ఉనికిని ఇబ్బంది పెట్టేలా ఉన్న జీవో నంబర్ 20ని ప్రభుత్వం సవరించాలి. జీవోలో ఆంక్షలు విధిండం మేం వ్యతిరేకిస్తున్నాం. జీవోను సవరించే వరకూ బిల్డింగ్‌లకు ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చేది లేదు.
– యేడిద దొరబాబు, అధ్యక్షుడు, ఎల్‌టీపీల
అసోసియేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌పై తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 20ని ఆయా పట్టణాల్లోని లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్లు (ఎల్‌టీపీ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో ద్వారా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ స్వీయ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్‌సీఎస్) విధానంతో ఆ బాధ్యతలను ఎల్‌టీపీలకు అప్పగించింది. అయితే ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ భవన యాజమాని ప్లాన్ అతిక్రమిస్తే ఎల్‌టీపీలను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలన్న నిబంధనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎల్‌టీపీలు జీవో వచ్చిన గత రెండు నెలల నుంచి 300 చదరపు మీటర్ల స్థలంలోపులో ఒక్క ప్లాన్ కూడా ఇవ్వకుండా నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఏడున్నర సెంట్ల లోపు ముఖ్యంగా రెసిడెన్షియల్ బిల్డింగ్‌లకు ప్లాన్‌ల అప్రూవల్‌లు చేయకపోవడంతో ప్లానులన్నీ నిలిచిపోయాయి.
మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఇచ్చే విధానంలో లోపాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఆ బాధ్యతను ఎల్‌టీపీలకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఏదైనా బిల్డింగ్ ప్లాన్‌కు అనుమతి ఇస్తే 10 శాతం వరకూ అతిక్రమణ (డీవియేషన్)కు మినహాయింపు ఉంటుంది. అంతకుమించి అతిక్రమణ జరిగితే భవన నిర్మాణాన్ని నిలిపివేస్తారు. అయితే ప్లాన్ ఇచ్చిన ఎల్‌టీపీని బాధ్యుణ్ణి చేయడం, సంబంధిత ఎల్‌టీపీ లైసెన్స్‌ను అయిదేళ్ల పాటు రద్దు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా ఉంటాయన్న జీవో నిబంధననే వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
మున్సిపాల్టీల ఆదాయాలకు గండి
ఎల్‌టీపీలు బిల్డింగ్ ప్లానులు ఇవ్వకపోవడంతో నిలిచిన భవన నిర్మాణాలతో ఆయా మున్సిపాలిటీలకు ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీలో గత ఏడాది 300 చదరపు మీటర్ల లోపు భవనాలకు 170 వరకూ ప్లాన్‌లు ఇస్తే జీవో వచ్చిన నాటి నుంచి ఒక్క ప్లాన్ కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అంచనా వేయవచ్చు, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి. జిల్లా మొత్తం మీద మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ జీవో అభ్యంతరాలు లేకపోతే ఈ రెండు నెలల్లో 100కి పైగా ప్లాన్లు మంజూరు చేసే అవకాశం ఉండేది. ప్లాన్‌లు ఇవ్వకపోవడంతో దాదాపు రూ.1.20 కోట్ల వరకూ ఆదాయానికి గండి పడింది. ప్లాన్‌లను ఎల్‌టీపీలు అనుమతించని పరిస్థితుల్లో కొత్తగా 300 చదరపు మీటర్ల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారు సైతం ఈ కొత్త జీవో, నిబంధనలపై పెదవి విరిస్తున్నారు. జీవోను వ్యతిరేకిస్తూ ప్లాన్‌లు ఇవ్వని ఎల్‌టీపీల నిరసన ఓ పక్క సాగుతుంటే కొందరైతే ప్లాన్ అప్రూవల్ లేకుండానే సొంత ప్లాన్‌లతో ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపాలిటీ పరంగా ఏదైనా అభ్యంతరం ఎదురైతే అప్పుడే చూద్దామన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారు.
మాపై చర్యలను మినహాయిస్తే జీవోను స్వాగతిస్తాం
భవన యాజమానులు ప్లాన్‌ను అతిక్రమిస్తే తమను బాధ్యులను చేయని పక్షంలో జీవోను స్వాగతిస్తామని ఎల్‌టీపీలు అంటున్నారు. లేదా 300 చదరపు మీటర్లు దాటిన స్థలాలకు ప్లాన్‌ను అనుమతి ఇచ్చే బాధ్యతలు తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జీవో నంబర్20ని సవరించి ప్లాన్ అతిక్రమణ అయితే తమ లైసెన్ప్ రద్దు చేయడం, క్రిమినల్ కేసు వంటి ఆంక్షలు తొలగించాలని సూచిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో అతిక్రమణ జరిగితే భవన యాజమానిని బాధ్యులను చేయాలే తప్ప తమను బాధ్యులను చేయడమేమిటని ఎల్‌టీపీలు ప్రశ్నిస్తున్నారు.
పట్టణాల్లో పట్టించుకోని ఎల్‌టీపీలు
జీవో నంబర్ 20ని వ్యతిరేకిస్తూ నిరసన
ఎల్‌టీపీలను బాధ్యులను చేస్తున్న
ఎస్‌సీఎస్ విధానం
నిలిచిన ప్లాన్ అప్రూవల్స్... తగ్గిన ఆదాయం