
47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం
నల్లజర్ల: జిల్లావ్యాప్తంగా వచ్చే ఖరీఫ్‌లో 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం) తాతారావు వెల్లడించారు. ప్రకృతి సాగుపై నల్లజర్లలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన, రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప్రత్యేకాధికారి ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ, సీజన్‌కు 45 రోజుల ముందు ఈ 47 వేల ఎకరాల్లో నవధాన్యాల సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరో 8 వేల ఎకరాల్లో ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా, సహజ పద్ధతుల్లో వరి సాగు చేపట్టనున్నామని చెప్పారు. మూడు నాలుగు సెంట్ల విస్తీర్ణం చొప్పున 20 వేల యూనిట్లలో కిచెన్ గార్డెన్లు వేయిస్తున్నామన్నారు. పంటపై డ్రోన్ల ద్వారా కషాయాలు, జీవామృతం పిచికారీ చేయనున్నామన్నారు. వంద గ్రామాల్లో వెయ్యి మంది రైతులతో దేశవాళీ వరి సాగు చేపట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలకే పరిమితమైన ప్రకృతి సాగును అన్ని రైతు సేవా కేంద్రాలకూ విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని తాతారావు చెప్పారు. సేంద్రియ కర్బనం, సహజమైన సూక్ష్మక్రిములు చనిపోకుండా మొక్కల ఎదుగుదలకు తోడ్పడేందుకు 32 రకాల విత్తనాలు (నవధాన్యాలు) రైతు సేవా కేంద్రాల్లో విక్రయిస్తున్నామని తెలిపారు. వీటిలో ఆకుకూరలు, కూరగాయలు, పశువుల మేత ఉంటాయని, వీటిని తొలకరికి ముందే దమ్ములో కలియదున్నడం వలన భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని వివరించారు. భూమిని 365 రోజులూ పచ్చగా ఉంచడం ద్వారా గాలిలోని కార్బన్‌డయాకై ్సడ్ భూమిలో సేంద్రియ కర్బనంగా స్థిరీకరణ అవుతుందని తాతారావు చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీపీఎం మహబూబ్ వలీ, యూనిట్ ఇన్‌చార్జి కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రేపు స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర
రాజమహేంద్రవరం సిటీ: నాలుగో విడత స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణపై తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించి, ఉపయోగంలోనికి తీసుకుని రావడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో ఈ అంశంపై గ్రామసభ నిర్వహించాలని సూచించారు. కార్యాలయాలను పూర్తి స్థాయిలో శుభ్రపరచాలన్నారు. కార్యకమ్రంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ కూడా పాల్గొన్నారు.

47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం