నాడు కాపు ఉద్యమంలో భాగంగా అమలాపురంలో కంచాలు కొడుతున్న నేతలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు’ అన్నట్టు తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారు. వందల కోట్ల రూపాయల స్కిల్ స్కామ్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు 21 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలులో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా కంచాలు కొడుతూ ప్రజాశబ్దం వినిపించాలంటూ లోకేష్ ఇచ్చిన పిలుపు నగుబాటుకు గురవుతోంది. శనివారం రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిమిషాలు పాటు కంచాలు, గరిటెలు, వాహనాల హారన్‌లు, అవేవీ అందుబాటులో లేకపోతే విజిల్స్‌తోనైనా ‘ప్రజాశబ్థం’ చేయాలని చేసిన ట్వీట్ ఉమ్మడిగోదావరి జిల్లాల్లో చర్చనీయాంశమైంది.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో మరోలా ప్రవర్తించడం టీడీపీ నేతలకు పరిపాటని పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. తమ పార్టీ అధినేత కటకటాలపాలై దిక్కుతోచక తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గోదావరి జిల్లాలు బలమైనవిగా భావించే పరిస్థితులు టీడీపీకి ఉండేవి. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ జనరంజక పాలనతో ఉనికి కోసం తంటాలుపడుతోంది. చంద్రబాబు జైలులో ఉన్నా జిల్లా ప్రజల సంగతి అటుంచితే పార్టీ నేతల కనీస స్పందన కూడా కొరవడిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గగ్గోలు పెట్టడం బహిరంగ రహస్యమే.
ఇదేం వైఖరి
చంద్రబాబు తరహాలోనే ఆ పార్టీ నేతలు రెండు నాల్కల ధోరణిి అనుసరిస్తున్నారు. తాము చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అనే టీడీపీ నేతల తీరును ప్రజలు గర్హిస్తున్నారు. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కాపు ఉద్యమం ప్రధానంగా నాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉదృతంగా సాగింది. ఆ క్రమంలో జనవరి 31న తుని రైలు దహనం సంఘటన జరిగింది. ఆనాటి సర్కారే తెరవెనుక నడిపిన మంత్రాంగం వల్లే ఈ సంఘటన జరగిందనే ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. ముద్రగడ పద్మనాభం సహా ఆ కుటుంబంలోని మహిళలని కూడా చూడకుండా టీడీపీ సర్కార్ దమనకాండకు పాల్పడింది.
దీనిపై కాపు సామాజిక వర్గీయులు శాంతియుత పంథాలో బాబు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇళ్ల వద్దనే కంచాలు, పళ్లాలు, ప్లేటులను గరిటెలతో దరువు వేస్తూ ‘కాపుల ఆకలి కేకలు’ అంటూ నినదించారు. శాంతియుతంగా ఇళ్లవద్ద, రోడ్డుకు ఇరువైపులా కూర్చుని కంచాలపై దరువువేసిన వారిపై కేసులు బనాయించింది. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా అందరిపైనా సెక్షన్ 341 కింద కేసులు పెట్టింది. సుమారు 400 కేసులు పెట్టింది.
కేసులు ఎత్తివేసిన జగన్
అక్రమ కేసులు ఎత్తేయాలని సామాజికవర్గ నేతలు, యువత వేడుకున్నా చంద్రబాబు సర్కార్ మనసు కరగలేదు. చివరకు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమనసు చాటుకున్నారు. గత పాలనలో కాపు ఉద్యమ సందర్భంలో పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తేశారు. నాడు ఉద్యమంలో భాగంగా కంచాలపై శబ్థాలుచేస్తేనే అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు చంద్రబాబుకు మద్ధతుగా అదే తరహాలో చేయమని లోకేష్ ట్వీట్ చేయడం సిగ్గు చేటని వివిధ పక్షాలు ఆక్షేపిస్తున్నాయి. అప్పుడు ఆ సామాజికవర్గం న్యాయమైన డిమాండ్ కోసం చేస్తే అక్రమ కేసులతో వేధించి ఇప్పుడు అదే పద్ధతిలో చంద్రబాబుకు సంఘీభావం తెలియచేయమనడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమంటున్నారు.
వేధించిన వారే కంచాలు కొట్టమంటే ఎలా?
శాంతియుతంగా కంచం శబ్దాలు చేస్తూ ఆందోళన చే స్తే చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసులు పె ట్టింది. మహిళలని కూడా చూడకుండా వేధించింది. ఎవరి ఇంటి వద్ద వారు కంచాలతో చప్పుడు చేస్తే పెద్ద నేరం చేసినట్టు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పింది. ఇప్పుడు అవినీతి కేసులో జైలులో ఉన్న చంద్రబాబు కోసం కంచాలతో దరువు వేయాలని లోకేష్ పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో జైలులో ఉన్న చంద్రబాబుకు ప్రజలు ఎలా మద్దతిస్తారు?
– అడ్డగర్ల వరలక్ష్మి, పి.గన్నవరం
నాడు ఉక్కుపాదం
కాపు ఉద్యమంపై నాడు ఉక్కుపాదం మోపడమే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏడెనిమిది నెలల పాటు పోలీసులను ఉసిగొల్పి వేధించింది. ఉద్యమ నాయకుడు ముద్రగడ కుటుంబంలోని మహిళలను అన్యాయంగా దుర్భాషలాడుతూ ఈడ్చుకుపోయారు. న్యాయమైన డిమాండ్‌తో నిరసన తెలిపితే కేసులు పెట్టిన చంద్రబాబుకు ప్రజలు ఎలా సంఘీభావం తెలుపుతారు?
– దలే చిట్టిబాబు, బోర్డు మెంబర్, అన్నవరం దేవస్థానం
లోకేష్ పిలుపు విస్మయంగా ఉంది
ఎవరింటి వద్ద వారు పిల్లాపాపలతో కంచాలు, ప్లేట్లపై చప్పుడు చేస్తే నాడు కేసులు పెట్టారు. ఇళ్లకు వచ్చి పోలీసులు చాలా ఇబ్బందులకు గురి చేశారు. నేడు వందల కోట్ల రూపాయల అవినీతి కేసులో చంద్రబాబు జైలులో ఉన్నారు. ఇప్పుడు కంచాలు కొట్టండని లోకేష్ కోరడం చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతోంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని అక్రమ కేసులు ఎత్తివేసి మేలు చేశారు.
– సూదా గణపతి, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment